నర్సింహ శర్మ (ఫైల్), శ్రీనివాస్(ఫైల్)
హైదరాబాద్(ఉప్పల్): ఉప్పల్‌లో శుక్రవారం తెల్లవారుజామున జంట హత్యలు చోటు చేసుకున్నాయి. గుర్తుతెలియని ఇద్దరు దుండగులు తండ్రీకొడుకుల్ని దారుణంగా చంపేశారు. ఆస్తి తగాదాలే ఈ దారుణానికి కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఎస్‌ఓటీ పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ప్రత్యక్ష సాక్షులు, హతుల కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం... ఉప్పల్ గాంధీ బొమ్మ సమీపంలోని హనుమసాయినగర్‌కు చెందిన నర్సింహుల నర్సింహ శర్మ (78) పురోహితుడు. ఆయన భార్య పదేళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు కొన్నాళ్లుగా మరో ప్రాంతంలో ఉంటున్నారు. దీంతో చాలాకాలం నర్సింహ ఒక్కరే హనుమసాయినగర్‌లో ఉన్నారు. ఈ విషయం తెలిసిన చిన్న కుమారుడు, మలేషియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసిన నర్సింహుల శ్రీనివాస్ (45) తండ్రి బాగోగులు చూడటానికి మూడు నెలల కిందట ఇక్కడికి వచ్చి తండ్రితో కలిసి ఉంటున్నారు.
రోజూ మాదిరిగానే శుక్రవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో పని మనిషి ఇంటి గేటు తీసుకుని లోపలకు వెళ్లింది. అప్పటికే ఆ ప్రాంతంలో వేచి ఉన్న ఇద్దరు దుండగులు భుజానికి ఉన్న బ్యాగ్‌తో ఆ ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించారు. పంతులు గారిని పిలవాలంటూ పని మనిషికి చెప్పడంతో ఆమె ‘మీ కోసం ఎవ్వరో వచ్చారు అయ్యగారు’ అంటూ నర్సింహకు చెప్పింది.
దీంతో పూజలో ఉన్న ఆయన గది నుంచి బయటకు వచ్చి పోర్టికోలో ఉన్న కుర్చీలో కూర్చున్నారు. ‘ఎవరు మీరు? ఏం కావాలి?’ అని అడుగుతుండగానే ఓ దండగుడు ఆయన సమీపంలోకి వెళ్లి వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. ఏదో జరుగుతోందని భావించిన నర్సింహ్మ గట్టిగా అరిచారు. ఈ అరుపులు విని అక్కడకు వచ్చిన పనిమనిషి జరుగుతోంది చూసి భయంతో అరుస్తూ పరుగులు పెట్టింది. ఈలోపే మరో దుండగుడు తనతో తెచ్చుకుని కత్తితో నర్సింహ గొంతు కోశాడు.
దీంతో ఆయన పక్కకు పడిపోయారు. ఈ గొడవ విన్న చిన్న కుమారుడు శ్రీనివాస్ ఇంటి మొదటి అంతస్తు నుంచి హడావుడిగా కిందికి వచ్చాడు. అప్పటికే తమ పని పూర్తి చేసుకుని వెళ్లిపోతున్న దుండగులను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో గేటు సమీపంలో శ్రీనివాస్ పైనా వాళ్లు విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేశారు. అక్కడికక్కడే కుప్పకూలిన అతడు కన్నుమూశాడు. ఈలోపు అక్కడకు చేరుకున్న స్థానికులు దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వాళ్లు కత్తులతో బెదిరించడంతో వెనక్కు తగ్గారు.
ముఖానికి ఎలాంటి ముసుగులు లేకుండా టీషర్టులు ధరించి వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టడం, తదితర పరిణామాల నేపథ్యంలో వీళ్లు కిరాయి హంతకులై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. జంట హత్యలపై సమాచారం అందుకున్న మల్కాజిగిరి డీసీపీ రక్షితా కె.మూర్తి, ఏసీపీ నరేష్ రెడ్డి, ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ గోవింద్ రెడ్డి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. ఇద్దరి మృతదేహాల వద్ద నుంచి బయలుదేరిన పోలీసు జాగిలాలు సమీపంలోనే దుండగులు పడేసిన బ్యాగ్ వరకు వెళ్లి వెనక్కు వచ్చాయి. ఆ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు తెరిచిన చూడగా... అందులో కుంకుమ, పుసుపు, అగర్‌బత్తీలు కనిపించాయి.
ఆస్తి తగాదాలు...కోర్టు వ్యాజ్యాలు
నర్సింహకు కొందరితో ఆస్తి తగాదాలతో పాటు కోర్టులో వ్యాజ్యాలు ఉన్నాయి. వాళ్లు రెండేళ్ల క్రితం ఓసారి నర్సింహపై దాడి చేశారు. గొంతు నులిమి హత్య చేయడానికి ప్రయత్నించారని ఆయన కుటుంబీకులు చెబుతున్నారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హతుల ఇంటితో పాటు వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజీ పరిశీలించారు.
ఈ నేపథ్యంలోనే దుండగులు ముగ్గురిగా అనుమానిస్తున్నారు. మూడో వ్యక్తి కాస్త దూరంలో ఉండి ఇద్దరిని నర్సింహ ఇంటికి పంపినట్లు భావిస్తున్నారు. నిందితుల కోసం ఏడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తండ్రి కోసం మలేషియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదులుకుని వచ్చిన శ్రీనివాస్ పాత కక్షలకు బలయ్యాడంటూ కుటుంబీకులు విలపించారు.
వారం రోజుల రెక్కీ..
నర్సింహ హత్యకు రంగంలోకి దిగిన దుండగులు వారం రోజుల పాటు పక్కాగా రెక్కీ చేశారు. దీనికోసం వాళ్లు హతుల ఇంటి ఎదురుగానే ఉన్న ఓ డీలక్స్ హాస్టల్‌లో బస చేశారు. అక్కడ ఉంటూనే ప్రతి రోజూ నర్సింహ ఇంటిని పరిశీలించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎవరెవరు వస్తుంటారు? ఆ ఇంటి పరిసరాలు, చుట్టు పక్కల ప్రాంతాలు ఏ సమయంలో ఎలా ఉంటాయి?
తదితర అంశాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. చివరకు తెల్ల వారుజాము సమయమే తమకు అనుకూలమని భావించి శుక్రవారం తమ పని పూర్తి చేసి పారిపోయారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న దుండగుల బ్యాగ్‌లో పూజా సామాగ్రితో పాటు కారం ప్యాకెట్ కూడా ఉన్నట్లు గుర్తించారు. హత్యకు ప్రత్యక్ష సాక్షి అయిన ఆ ఇంటి పని మనిషి నుంచి వాంగ్మూలం సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment