ఇద్దరు విద్యార్థినుల అనుమానాస్పద మృతి | The brutal murder of two girls in Warangal | Sakshi
Sakshi News home page

ఇద్దరు విద్యార్థినుల అనుమానాస్పద మృతి

Published Mon, Dec 28 2015 2:36 AM | Last Updated on Mon, Jul 30 2018 9:15 PM

ఇద్దరు విద్యార్థినుల అనుమానాస్పద మృతి - Sakshi

ఇద్దరు విద్యార్థినుల అనుమానాస్పద మృతి

* ఖాదర్‌పేట గుట్టపై ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల మృతి
* రెండు మృతదేహాలు.. ఆరు ముక్కలు
* కంబాలకుంట తండాలో విషాదం

నర్సంపేట/చెన్నారావుపేట/పర్వతగిరి : హాస్టల్‌కని వెళ్లిన ఆ బాలికలు అనంతలోకాలకు చేరారు. హత్యో.. ఆత్మహత్యో  తేలలేదుగానీ వారి మృతి కన్నవారికి కడుపుకోతను మిగిల్చింది.  పర్వతగిరి మండలం నారాయణపురం శివారు కం బాలకుంట తండాకు చెందిన అన్నదమ్ములు బానోత్ కిషన్, బానోత్ బాలుల కుమార్తెలయిన ప్రియాంక, భూమిక చిన్నప్పటి నుంచి ఎంతో కలివిడిగా ఉండేవారు.

6వ తరగతి నుంచి మూడుచెక్కలపల్లి హాస్టల్‌లో చదువుకుంటున్నారు. ఇద్దరూ అనారోగ్య కారణాలతో నవంబర్ 6న ఇంటికి వెళ్లారు. తిరిగి 23వ తేదీన హాస్టల్‌కు వెళ్తున్నామని చెప్పి ఇంట్లో నుంచి బయల్దేరిన వారు.. అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో వెదికారు. చివరికి నవంబర్ 28న బాలికల తండ్రులు బానోత్ కిషన్, బాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానం ఉన్న నారాయణపురం గ్రామానికి చెందిన కందికట్ల మోహన్, మూడు వెంకన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వారిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. అయినా బాలికల జాడ తెలియరాలేదు.  కాగా, చెన్నారావుపేట వుండలం ఖాదర్‌పేటకు చెందిన ఊరకుక్కలు విద్యార్థినుల అవయవాలను గ్రామంలోకి తీసుకురావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గుట్టవైపు వెళుతున్న కుక్కలను అనుసరించగా మృతదేహాలు కనిపించాయి.
 
ఉన్నతాధికారులు దృష్టి సారించి ఉంటే..
ఇద్దరు విద్యార్థినుల అదృశ్యంపై ఫిర్యాదు అందిన వెంటనే ఉన్నతాధికారులు దృష్టి సారించి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని స్థానికులు అభిప్రాయపడ్డారు. బాలికల అదృశ్యం కేసు దర్యాప్తులో, వేగవంతం చేయడంలో పోలీస్ అధికారుల నిర్లిప్తత స్పష్టంగా కనిపించిందని వారు వాపోయారు.
 
సంఘటన స్థలాన్ని పరిశీలించిన రూరల్ ఎస్పీ..
ఖాదర్‌పేట గుట్టపై సంఘటన స్థలాన్ని రూరల్ ఎస్పీ అంబర్ కిశోర్‌ఝాతోపాటు గూడూరు సీఐ వెంకటేశ్వర్‌రావు, దుగ్గొండి ఎస్సై వెంకటేశ్వర్లు పరిశీలించారు. అనంతరం మృతుల తల్లిదండ్రులతో ఎస్పీ మాట్లాడి వివరాలు సేకరించి స్థానిక పోలీసులకు సూచనలు ఇచ్చారు. జిల్లా కేంద్రం నుంచి డాగ్‌స్క్వాడ్ బృందం చేరుకుని వివరాలు సేకరించారు. సంఘటన స్థలంలోనే పంచనామ నిర్వహించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు.

సుమోటోగా కేసు నమోదు
చెన్నారావుపేట : ఇద్దరు విద్యార్థినుల అనుమానాస్పద మృతిపై మీడియూ కథనాలను ఆధారంగా చేసుకుని సుమోటో కేసు నమోదు చేసినట్లు స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మెంబర్ అచ్యుతరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థినుల మృతిపై 2016, జనవరి 10వ తేదీలోపు నివేదికలు అందించాలని కలెక్టర్, ఎస్పీని కోరారు. అంతేగాక మృతిచెందిన విద్యార్థినుల కుటుంబాలకు తక్షణ సాయంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా కలెక్టర్ నేరుగా సుమారు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించాలన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement