తిరుమల వెళ్లే వెంకన్న భక్తులకు తీపి కబురు. విమానంలో వెళ్లి తక్కువ సమయంలోనే స్వామిని దర్శించి తిరిగి వచ్చేయాలని తలచే యాత్రికుల కోసం సరికొత్త విమాన ప్యాకేజీని ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు ఐఆర్‌సీటీసీ సన్నాహాలు చేస్తోంది. ఇక వేంకటేశుని దర్శన టికెట్ కోసం తిప్పలు పడే భక్తుల కోసం ఆర్టీసీ ఓ పథకం ప్రవేశపెడుతోంది. బస్సు టికెట్‌తోపాటు రూ.300ల దర్శనం టికెట్‌ను దీంతో అందిస్తారు.
వెంకన్న దర్శనానికిఆర్టీసీ టికెట్
రోజుకు 30 మందికి ఛాన్స్
అధీకృత ఏజెంట్ల వద్ద కూడా లభ్యం
విశాఖ నుంచి ప్రారంభం
విశాఖపట్నం: తిరుపతి వేంకటేశ్వరుని దర్శనానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.. ఆయన దర్శన భాగ్యానికి వారాలు, నెలలు ముందుగా బుక్ చేసుకున్నా దొరకని పరిస్థితి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ యాజమాన్యం వెంకన్న భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తోంది. ఇందులోభాగంగా విశాఖలోనూ దీనికి శ్రీకారం చుట్టింది. ఈ సదుపాయాన్ని పొందడానికి ఏంచేయాలంటే.. విశాఖ నుంచి తిరుపతికి రోజుకు ఒక గరుడ సర్వీసును ఆర్టీసీ నడుపుతోంది.
ఈ బస్సులో వెళ్లి తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకోవాలనుకునే వారికి బస్సు టికెట్‌తో పాటు స్వామి టికెట్ పొందే వీలు కల్పించింది. బస్సు చార్జికి అదనంగా రూ.300 చెల్లించి దర్శన టికెట్ పొందవచ్చన్నమాట. వీటిని ముందస్తుగా రిజర్వేషన్, ఆన్‌లైన్‌లోనే కాదు.. అప్పటికప్పుడు కౌంటర్‌లోనూ, మొబైల్ యాప్ ద్వారా, ఆర్టీసీ అధీకృత ఏజెంట్ల వద్ద కూడా వీటి ని అందుబాటులో ఉంచుతున్నారు.
ఈ బస్సులో రోజుకు 30 మందికి తిరుమలేశుని దర్శన టికె ట్లను జారీ చేస్తారు. ఈ టికెట్లను పొందే సమయంలో వారికి ఏ రోజు, ఏ సమయంలో దర్శనం కావాలో చెప్పాల్సి ఉంటుంది. ఆ మేరకు ఆర్టీసీ నుంచి స్వామి దర్శన టికెట్ పొందిన వారికి దర్శన తేదీ, సమయాన్ని సంబంధిత భక్తుడు/ప్రయాణికుడి మొబైల్ ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం వస్తుంది. విశాఖ నుంచి తిరుపతికి గరుడ ఏసీ సర్వీసు టికెట్ రూ.1597 ఉంది. వేంకటేశ్వరస్వామి శీఘ్ర దర్శనం టికెట్ కోసం అదనంగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. తిరుపతిలో దిగాక కొండపైకి వెళ్లడానికి అక్కడ బస్సుల్లో టికెట్ తీసుకోవాల్సిందే.
విశాఖ ద్వారకా బస్‌స్టేషన్ నుంచి ఈ బస్సు రోజూ సాయంత్రం 5.30కి బయల్దేరి మర్నాడు ఉదయం 6 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అంటే 12.30 గంటల ప్రయాణ సమయం పడుతుంది. ఇటీవలే లాంఛనంగా ప్రారంభించిన ఈ సదుపాయాన్ని భక్తులు వినియోగించుకుంటున్నారని ఆర్టీసీ విశాఖ రీజియన్ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ సుధాబిందు ‘సాక్షి’కి చెప్పారు.
త్వరలో విశాఖ-తిరుపతి ఫ్లైట్ ప్యాకేజీ
దసరాకు గోవా, విదేశాలకు కూడా
ఐఆర్‌సీటీసీ సన్నాహాలు
విశాఖపట్నం: త్వరలో విశాఖపట్నం-తిరుపతి మధ్య ఫ్లైట్ ప్యాకేజీ ప్రారంభం కాబోతోంది. ఐఆర్‌సీటీసీ ప్రస్తుతం హైదరాబాద్-తిరుపతి మధ్య ఇలాంటి ప్యాకేజీనే అమలు చేస్తోంది. దీనికి ఆదరణ లభిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బుధవారం విశాఖ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఆర్‌సీటీసీ (సికింద్రాబాద్) డిప్యూటి జనరల్ మేనేజర్ ఎన్.సంజీవయ్య తెలిపారు.
రెండు రోజుల ఈ ప్యాకేజీలో విశాఖ నుంచి తిరుపతి విమానంలో తీసుకెళ్లి, తిరుమల దర్శనం చేయిస్తామని, కాణిపాకం, తిరుచానూరు, అలివేలు మంగాపురం తదితర ప్రాంతాల సందర్శన ఉంటుందని చెప్పారు. ఈ ప్యాకేజీ రూ.10 వేలు ఉంటుందన్నారు. అక్టోబర్ 8-12 మధ్య హైదరాబాద్ నుంచి హాంకాంగ్, మకావ్, షెంజియన్ దేశాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రారంభిస్తామన్నారు. నాలుగు రాత్రులు, ఐదు రోజుల ఈ ప్యాకేజీ చార్జి రూ.73419గా నిర్ణయించామన్నారు. ఇంకా గోవా-హైదరాబాద్ మధ్య 3 రాత్రులు, 4 రోజుల ఫ్లైట్ ప్యాకేజీని రూ.18 వేల చార్జి ఉంటుందని చెప్పారు.
యాత్రా స్పెషల్స్..
అలాగే విశాఖ నుంచి దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాలకు యాత్రా స్పెషల్ పేరిట రైలు ప్యాకేజీలను ప్రారంభిస్తామని తెలిపారు. త్వరలో విశాఖ రైల్వేస్టేషన్లో ఐఆర్‌సీటీసీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే హైదరాబాద్-విశాఖ మధ్య రైలు ప్యాకేజీ ఉందని, మూడు నెలల్లో ఫ్లైట్ ప్యాకేజీ అమలు చేస్తామని చెప్పారు.
నమో వెంకటేశ
Published Thu, Sep 1 2016 10:01 AM | Last Updated on Thu, May 3 2018 3:20 PM
Advertisement
Advertisement