
బువ్వ కరువు
- ఇంటర్ విద్యార్థులకు అందని మధ్యాహ్న భోజనం
- ప్రతిపాదనల వద్ద ఆగిన నిర్ణయం..
- పట్టించుకోని ప్రభుత్వం
సంగారెడ్డి మున్సిపాలిటీ:మధ్యాహ్న భోజనం పథకం ఇంటర్ విద్యార్థుల ఆకలి తీర్చలేకపోతోంది. విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు చర్యలకు ఉపక్రమించలేదు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా 50 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 16 వేల మంది పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది.
ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు హైస్కూల్ తరహాలోనే మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా పథకం నేటికీ అమలు కాలేదు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 16 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని, వారికి తగిన భోజన ఏర్పాట్లు చేయాలని ఇంటర్ బోర్డు డివిజనల్ విద్యాధికారి కాశీనాథ్ ప్రభుత్వానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
కానీ, పైనుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన స్వయంగా చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది మార్చిలో హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం పథకం సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సాక్షాత్తు సీఎం కేసీఆర్.. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలని ఆదేశించారు. ఈమేరకు ఫైన్‌రైస్‌కు సంబంధించిన ప్రతిపాదనలు తయారుచేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.
దాంతో పాటే ఇంటర్ బోర్డు అధికారులకు సైతం కళాశాలల వారీగా విద్యార్థుల వివరాలతో పాటు కిచెన్, వంట సామగ్రికి సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా జిల్లావ్యాప్తంగా 50 ఇంటర్ కాలేజీలు ఉన్నాయని, 12 చోట్ల తాత్కాలిక కిచెన్ షెడ్లు, వంట సామగ్రి అవసరం ఉన్నట్టు తెలిసింది. కాగా, విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా మధ్యాహ్న భోజన పథకం ఎక్కడా ప్రారంభం కాలేదు.
ప్రతిపాదనలు పంపించాం: కాశీనాథ్, డీవీఈఓ
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిపాదనలు పంపించాం. జిల్లా వ్యాప్తంగా 50 జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరంలో(ఆగస్టు 1 నాటికి) 7,800, సెకండ్ ఇయర్‌లో 8,200 మంది విద్యార్థులు ఉన్నారు. 12 కాలేజీలకు సొంత భవనాలు లేక అద్దె బిల్డింగుల్లో కొనసాగుతున్నాయి. అక్కడ తాత్కాలిక షెడ్లు ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది. ప్రతిపాదనలు పంపించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదు.
సమాచారం లేదు: అనిల్‌రెడ్డి, ఏబీవీపీ జిల్లా కన్వీనర్
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఎంతమంది చదువుతున్నారన్న సమాచారం కూడా ప్రభుత్వం వద్ద లేదు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తామని ప్రభుత్వం దీంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. విద్యార్థుల అవసరాల దృష్ట్యా నిర్ణయం తీసుకోవాలి.
నీరసంగా ఉంటుంది: శిరీష, విద్యార్థిని, కొండాపూర్ ప్రభుత్వ కళాశాల
ఉదయం 9 గంటలకు అలియాబాద్ నుంచి కాలేజీకి వస్తాం. తిరిగి సాయంత్రం 7 గంటలకు ఇంటికి వెళ్లాం. అప్పటి వరకు ఉదయం తిన్న భోజనమే. దీంతో నీరసంగా ఉంటోంది. చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నాం. ప్రభుత్వ మధ్యాహ్న భోజనం త్వరగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.