బై బై గణేశా !
వైభవంగా వినాయక శోభాయాత్ర
రెండు చోట్ల అపశ్రుతులు.. ఇద్దరి మృతి
జిల్లా అంతటా బుధవారం ఆధ్యాత్మిక శోభ సంతరించకుంది. డప్పు చప్పుళ్లు .. బాజాబజంత్రీలు.. డ్యాన్సులు.. కోలాట నృత్యాలతో గణనాథుల శోభాయాత్ర వైభవంగా కొనసాగింది. నవరాత్రులు పూజలందుకున్న పార్వతీ తనయుడిని భక్తులు నిమజ్జనానికి తరలించారు. నల్లగొండ పట్టణంలోని 1వ వార్డులో కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించారు.14వ మైలు, వల్లభరావు చెరువు, వాడపల్లి, నాగార్జునసాగర్ వద్ద విఘ్నేశ్వరుల విగ్రహాలను నిమజ్జనం చేశారు. అంతకుముందు మండలపాల వద్ద లడ్డూ వేలం పాటలు నిర్వహించారు. మునుగోడు మండలం కల్వకుంట్ల గ్రామానికి చెందిన సురేష్(24) చెరువులో మునిగి, భువనగిరిలో నేరెల్ల రాజు(30) అనేయువకుడు కత్తిపోట్లకు గురై మృత్యువాత పడ్డారు.