సాగర్‌ను సిద్దేశ్వరం దగ్గర కట్టి ఉంటే..
కర్నూలు సిటీ: పట్టిసీమతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రులకు దమ్ము, ధైర్యం ఉంటే కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద బహిరంగ చర్చకు రావాలని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. సాగర్‌ను సిద్దేశ్వరం దగ్గర కట్టి ఉంటే.. ఈ రోజు రాయలసీమ పచ్చటి పొలాలతో కళకళలాడేదన్నారు.
మంగళవారం ఆయన కర్నూలులోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల గురించి పట్టించుకోని బాబు.. రైతు యాత్రల పేరిట ఏసీ బస్సుల్లో తిరగడం విడ్డూరంగా ఉందన్నారు. బాబుకి రైతులంటే అలర్జీ అని, అన్నదాతల వాసనంటే గిట్టదన్నారు. ఈ నెల 23న జెడ్పీ సమావేశంలో శ్రీశైలంలో 854 అడుగుల కనీస నీటి మట్టంపై తీర్మానం చేసేందుకు ప్రతి పక్షాలు పట్టుబడితే.. డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి వాకౌట్ చేసుకోండి అని చెప్పడం ఆ పార్టీ నేతల అహంకారానికి నిదర్శనమన్నారు.
నాగార్జునసాగర్ నిర్మించేటప్పుడు కూడా నాటి ప్రభుత్వ పెద్దలు సాగర్ నీటితో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని ఇచ్చిన మాటను ఇక్కడి ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. హంద్రీనీవా కాంట్రాక్టర్లందరూ బాబు చూట్టే ఉన్నారని, వారి అక్రమాల వల్లే కాలువకు గండ్లు పడుతున్నాయన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పరిధిలో రైతులకు తెలియకుండా రిలయన్స్‌కు 5,500 ఎకరాల భూములను కట్ట బెట్టారని, ఈ వ్యవహారంపై వచ్చే నెల 14, 15, 16 తేదీల్లో రైతుల బతుకుదెరువు యాత్ర చేపడతానన్నారు.