
బ్లూటంగ్‌తో జాగ్రత్త ..
అనంతపురం అగ్రికల్చర్ : గొర్రెల్లో నీలినాలుక వ్యాధి (బ్లూటంగ్) సోకే అవకాశం ఉన్నందున కాపర్లు అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధకశాఖ ‘అనంత’ డివిజన్ సహాయ సంచాలకులు డాక్టర్ టి.శ్రీనాథాచార్ తెలిపారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదైనా, వర్షాలు ఎక్కువగా వచ్చినా వ్యాధి రావడానికి ఆస్కారముందన్నారు. వ్యాధి లక్షణాలు.. చికిత్స.. నివారణా మార్గాలు.. ఆయన ఇలా వివరిస్తున్నారు.
బ్లూటంVŠ S: ఇది ‘క్యూలెకాయిడ్’ రకం దోమల వల్ల వ్యాపిస్తుంది. వ్యాధి బారిన పడిన గొర్రెలు ఎక్కువగా ఈసుకుపోవడం (అబార్షన్), పాల ఉత్పత్తి పడిపోవడం, గొర్రెపిల్లలు బలహీనపడటం, మాంసం, ఉన్ని నాణ్యత దెబ్బతినడం వల్ల ఆర్థికంగా నష్టం జరుగుతుంది. ఈ వ్యాధిని ‘ఏ’ క్యాటగిరీలో చేర్చినందున వీటి మాంసం విదేశీ ఎగుమతికి అవకాశం లేదు. ఈ వ్యాధి ఒక ఏడాదిలోపు గొర్రె పిల్లల్లో ఎక్కువగా సంభవిస్తుంది.
లక్షణాలు : 104 నుంచి 106 డిగ్రీల జ్వరం, ముఖం, ముక్కు, పెదవులు వాచి వుండటం, నాలుక ఎర్రగా తయారై నీలి రంగుకు మారుతుంది. కళ్లుగా ఎర్రబడి కనురెప్పలు, చెవులు, కింది దవడ వాపు రావడం జరుగుతుంది. ముక్కు నుంచి తెల్లటి జిగట స్రవాలు రావడం, నోటిలోని మాంసం పొరలు (మ్యూకస్ మెంబ్రేన్) పుండ్ల మాదిరిగా ఏర్పడటం, తొడల మధ్య, చంకల్లో, మల ద్వారం కింద చర్మం ఎర్రగా కమిలినట్లు ఉండటం, వ్యాధి తీవ్రంగా ఉన్న గొర్రెల్లో గిట్టల మొదటి భాగం వాచి, మధ్యలో ఎర్రగా ఉండటం, చర్మం దెబ్బనడం వల్ల ఉన్ని, వెంట్రుకలు ఊడిపోవడం, తీవ్రతను బట్టి ఐదారు రోజులు మేత మేయక, నీరు తాగక నీరసించి చనిపోయే అవకాశం ఉంటుంది. చనిపోయిన గొర్రెల్లో ఊపిరితిత్తులు వాపు, గాలిగొట్టాలు నురుగ వంటి ద్రవాలతో నిండిపోవడం, ఎద భాగంలో నీరు చేరుట, గుండె పొరల్లో రక్తస్రావం, ఊపిరితిత్తులకు సంబంధించిన రక్తనాళం మొదటి భాగంలో రక్తస్రావం జరిగినట్లు తెలుస్తుంది.
చికిత్స : ఎలీసా పరీక్ష ద్వారా వ్యాధి నిర్ధారించవచ్చు. వ్యాధి బహిర్గతమైన తర్వాత ఎలాంటి చికిత్స లేదు. గాలికుంటు, పీపీఆర్ వ్యాధి లక్షణాలు కూడా నీలినాలుక వ్యాధికి సారూప్యత ఉండటంతో పశువైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి. నోటిలో పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి, బోరిక్ పౌడర్‌ను పూయాలి. వైద్యుని సలహా మేరకు యాంటీబయాటిక్ మందులు వాడాలి. గిట్టల మధ్య పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి, హిమాక్స్, నెమ్‌లెంట్ వంటి మందులను పూయాలి.
దోమలను నివారించాలి :
వర్షాకాలంలో గొర్రెల కొట్టం, పరిసర ప్రాంతాల్లో నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సాయంత్రం, రాత్రి సమయాల్లో మంద చుట్టూ వేపాకు పొగ వేసి దోమలను నివారించవచ్చు. ప్రతి 10–15 రోజులకోసారి గొర్రెల శరీరంపై, కొట్టంలో 2 శాతం బ్యూటాక్స్ మందును పిచికారీ చేయడం ద్వారా దోమకాటును అరికట్టవచ్చు. రాత్రి పూట మందుకు కొద్ది దూరంలో పెట్రోమాక్స్ లైట్లను వెలిగించడం ద్వారా దోమల శాతాన్ని తగ్గించవచ్చు. గొర్రెలను ఎల్తైన ప్రదేశంలో ఉంచాలి. గొర్రెల మందలో ఆవులు, దూడలు కట్టేయడం ద్వారా దోమలు వాటì పై వాలి గొర్రెలకు బెడద తగ్గుతుంది.