నగదు రహిత లావాదేవీలు పెంపొందించాలి
-
జేసీ ఇంతియాజ్
నెల్లూరు(పొగతోట):
జిల్లాలో నగదు రహిత లావాదేవీలను పెంపొందించేలా బ్యాంకింగ్ వ్యవస్థను మెరుగుపరచాలని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ బ్యాంక్ కరస్పాండెంట్లకు సూచించారు. గురువారం స్థానిక గోల్డన్ జూబ్లీహాల్లో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో బ్యాంక్ కరస్పాండెంట్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ మాట్లాడారు. జిల్లాలో 35 లక్షల బ్యాంకు ఖాతాలు ఉన్నాయన్నారు. వాటిలో 4.50 లక్షల జనధన్ ఖాతాలు ఉన్నాయన్నారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు వలన నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. క్రెడిట్, డెబిట్, రూపే, జనధన్ కార్డులను ప్రజలు ఉపయోగించేలా చర్యలు చేపట్టాలన్నారు. వ్యాపారులు రూ.50 వేలకు మించి లావాదేవీలు చేయవచ్చునని తెలిపారు. జిల్లాలోని 1890 చౌకదుకాణాల్లో నగదు రహిత పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. బ్యాంక్ ఖాతాలు లేని పింఛన్‌దారులు, ఉపాధి కూలీలను గుర్తించాలన్నారు. వారందరికీ డిసెంబర్ 1వ తేదీలోపు బ్యాంక్ ఖాతాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం జేసీ వ్యవసాయం, కార్మిక శాఖ, వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి స్వైపింగ్ మిషన్ల ఏర్పాటుపై సమీక్షించారు. సమావేశంలో ఏపీజీబీ ఆర్‌ఎం బీవీ శివయ్య, సీనియర్ మేనేజర్ ఎంఎస్ రామ్ పాల్గొన్నారు.