కడుపులో కత్తెర పై విచారణ | jc imthiaz ahmed inquiry on Scissors in the stomach | Sakshi
Sakshi News home page

కడుపులో కత్తెర పై విచారణ

Published Fri, Nov 3 2017 1:32 PM | Last Updated on Fri, Nov 3 2017 1:32 PM

jc imthiaz ahmed inquiry on Scissors in the stomach - Sakshi

నెల్లూరు(బారకాసు): రోగి చలపతి కడుపులో కత్తెర ఉంచి కుట్లు వేసిన ఘటనపై గురువారం జేసీ ఇంతియాజ్‌ అహ్మద్‌ నేతృత్వంలోని కమిటీ జీజీహెచ్‌లో విచారణ చేపట్టింది. రాష్ట్ర వ్యా ప్తంగా సంచలనం సృష్టించిన వైద్యుల నిర్లక్ష్యం ఘటనపై  మానవ హక్కుల కమి షన్‌ (హెచ్చార్సీ) తీవ్రంగా స్పందించిన విషయం విదితమే. హెచ్చార్సీ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ ఆర్‌.ముత్యాలరాజు ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని కమిటీ చైర్మన్‌గా జేసీ, సభ్యులుగా ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సీవీ రమాదేవి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాధాకృష్ణరాజును నియమించిన విషయం తెలిసిందే. గురువారం జీజీహెచ్‌లో జరిగిన విచారణకు చలపతికి రెండు స్లారు ఆపరేషన్‌ చేసిన వైద్యులు, నర్సులు మొత్తం 8 మంది హాజరయ్యారు. వీరిలో జనరల్‌ సర్జన్‌ హెచ్‌ఓడీ డాక్టర్‌ పద్మశ్రీ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ పద్మజారాణి, డాక్టర్‌ శ్రీలక్ష్మి, సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్‌ సాయిసందీప్, మత్తు విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ వేణుగోపాల్, డాక్టర్‌ ప్రియాంక, స్టాఫ్‌ నర్సులు పార్వతి, అనిత  ఉన్నారు.

మూడు గంటలపాటు విచారణ
ఆపరేషన్‌లో పాల్గొన్న వైద్యులు, నర్సులను మూడు గంటల పాటు కమిటీ విచారించింది. ఒక్కొక్కరిని పిలిచి ఆపరేషన్‌ జరిగిన సమయంలో ఏం జరిగింది? ఆ సమయంలో చేసిన పని ఏమిటని పూర్తిస్థాయిలో విచారించారు. ఈ మేరకు వైద్యులు, నర్సుల వాగ్మూలాన్ని లిఖిత పూర్వకంగా తీసుకున్నారు. పేషెంట్‌కు సంబంధించిన కేస్‌షీట్‌ను కూడా జేసీ తీసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ ఇంతియాజ్‌ మాట్లాడుతూ కలెక్టర్‌ ఆదేశాల మేరకు తాము పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామని, ఇందుకు సంబంధించిన నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. దీనిపై మరింత లోతుగా సమగ్రంగా విచారణ జరిపి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందన్నారు.

 అనంతరం జేసీ ఇంతియాజ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చలపతిని పరామర్శించారు. ఆయన భార్య జానకమ్మతో మాట్లాడి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జీజీహెచ్‌ అడ్మినిస్ట్రేటర్‌ డాక్టర్‌ కళారాణి, ఇన్‌చార్జి ఆర్‌ఎంఓ డాక్టర్‌ వరప్రసాద్‌ ఉన్నారు.

బాధ్యులపై చర్యలెప్పుడో?
ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ఇంత వరకు కనీసం ప్రాథమిక చర్యలు కూడా తీసుకున్న దాఖలాలు లేవు. బాధ్యులకు మెమోలు ఇవ్వకపోవడం పలు అనుమానాలకు వ్యక్తమవుతున్నాయి. సంఘటన జరిగి ఇన్ని రోజులైతే చివరికి విషయం బయటకు పొక్కడం, మానవ హక్కుల కమిషన్‌ స్పందించడంతో గురువారం అధికారులు విచారణ చేపట్టిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే విచారణ నివేదికలను ఉన్నతాధికారులు పరిశీలించేదెప్పుడు..బాధ్యులపై చర్యలు తీసుకునేదెప్పుడు? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement