నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలి
లేదంటే లైసెన్స్ రద్దు
ఈ నెల 31 చివరి తేదీ
జిల్లా కలెక్టర్ అమ్రపాలి
హన్మకొండఅర్బన్ (వరంగల్ పశ్చిమ) : జిల్లాలోని వ్యాపార వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు ఈ నెల 31నాటికి నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని, లేనిపక్షంలో ఆ సంస్థల లైసెన్స్‌లు రద్దు చేస్తామని కలెక్టర్ అమ్రపాలి హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లో విజిలెన్స్, ఎన్‌పోర్స్‌మెంట్ వరంగల్ యూనిట్ ఆధ్వర్యంలో నగదు రహిత లావాదేవీలపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని సంస్థలు ఆర్టీజీఎస్, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, ఇతర సాకేంతిక విధానాలు ఏర్పాటు చేసుకుని నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలన్నారు. సంస్థల్లో పనిచేసే సిబ్బందికి కూడా బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్, ఆధార్ కలిగి ఉండాలని అన్నారు. జిల్లా యంత్రాంగం నుంచి అవసరం మేరకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజర్ శ్రీకాంత్, ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ శ్రీను, కార్పొరేషన్‌బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ చిత్ర, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
క్షయ వ్యాధిపై అవగాహన కల్పించాలి
జిల్లాలో క్షయ వ్యాధి నివారణకు సంబంధించి వైద్య అధికారులు తగు చర్యలు తీసుకోవడంతోపాటు వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అమ్రపాలి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో క్షయవ్యాధి నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షయవాధి బాధితుల నుంచి వారి కుటుంబ సభ్యులకు, పక్కవారికి వ్యాధి సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందస్తుగా అవగాహన కల్పించాలన్నారు. వ్యాధిని సకాలంలో గుర్తించి సరైన చికిత్స అందించాలన్నారు. సమావేశంలో క్షయవ్యాధి ప్రోగ్రాం అధికారి డాక్టర్ సూర్యప్రకాష్, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, లెప్రసీ విభాగం అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్యామనీరజ, డాక్టర్ శ్రవణ్‌కుమార్, ప్రొఫెసర్ శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.
జీఎంహెచ్‌ను తనిఖీ చేసిన కలెక్టర్
హన్మకొండ చౌరస్తా (వరంగల్ పశ్చిమ): హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని మంగళవారం కలెక్టర్ అమ్రపాలి తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రతి వార్డును క్షణ్ణంగా పరిశీలించిన ఆమె సమస్యలు, కావాల్సిన వసతులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, సూపరింటెండెంట్ నిర్మల, ఆర్‌ఎంఓ సుధార్‌సింగ్‌తో సమావేశమయ్యారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ, బడ్జెట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, సుమారు గంట పాటు ఆసుపత్రిలో సమయం వెచ్చించిన కలెక్టర్ తిరిగి బయటకు వెళ్తుండగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.