‘క్యాష్‌లెస్’కు ఊతం
►ఎస్‌హెచ్‌జీ మహిళలకు స్మార్ట్ ఫోన్లు
►కొనుగోలుకు స్త్రీనిధి ద్వారా రూ.6 వేల రుణం
►24 వాయిదాల్లో చెల్లించేందుకు నిర్ణయం
►నగదు రహిత లావాదేవీలు పెంచేందుకు ప్రభుత్వ ప్రయత్నం
►రూరల్ జిల్లాలో 1.62 లక్షల మందికి లబ్ధి
వరంగల్ రూరల్ (వెల్ఫేర్) : కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత దేశ వ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు పెంచేందుకు అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్టీసీ బస్సులు, బస్టాండ్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అయితే క్యాష్‌లెస్ లావాదేవీలను పెంచేందుకు తాజాగా మరో అడుగు ముందుకు పడుతోంది. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)ల్లోని మహిళల వద్ద స్మార్ట్‌ఫోన్లు ఉంటే నగదు రహిత లావాదేవీలు ఊపందుకుంటాయని భావించి వారికి అవగాహన కల్పించాలని అధికారులు నిర్ణయించారు. కాగా, సంఘాల్లోని మహిళలకు ఫోన్లు కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత లేదని గుర్తించి.. స్త్రీనిధి బ్యాంకు ద్వారా రుణం ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నారు. దీంతో రూరల్ జిల్లాలో 1.62 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.
రూ.6 వేలు.. 24 వాయిదాలు
మహిళా సంఘాల్లోని సభ్యులు ఒక్కొక్కరు సెల్‌ఫోన్ కొనుగోలు చేసేందుకు రూ.6 వేల చొప్పున స్త్రీ నిధి బ్యాంకు ద్వారా రుణం అంజేయనున్నారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ కమిటీ సమావేశంలో అధికారులు నిర్ణయించారు. ఇలా రుణంగా అందే నగదుతో మహిళలు ఏ కంపెనీ ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్ అయినా కొనుగోలు చేసుకోవచ్చు. అనంతరం 24 వాయిదాల్లో రూ.275 చొప్పున ఈ నగదును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక్కో మహిళ తీసుకున్న రూ.6 వేలకు రూ.6,600 చెల్లించాల్సి వస్తుంది. ఇది పెద్దగా భారమేం కాదు కనుక మహిళలంతా స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేస్తారని, తద్వారా నగదు రహిత లావాదేవీలు పెరుగుతాయనేది ప్రభుత్వ భావిస్తోంది. కాగా, అందరూ రుణం తీసుకోవాలనే నిబంధన విధించకపోవడంతో ఆసక్తి ఉన్న వారే రుణం తీసుకోవడంతో పాటు స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
స్త్రీ ‘నిధి’ సాయం..
స్త్రీనిధి బ్యాంకు ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు చేయూతనిచ్చేందుకు అనేక పథకాలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం మహిళా సంఘాలకు రూ.71.54 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉంది. అయితే, ఇందులో ఇప్పటివరకు రూ.30 కోట్ల మేరకు అందజేశారు. దీంతో మిగిలిన రూ.41 కోట్లను వచ్చే నెల ముగిసేలోగా అందజేయాలని అధికారులు భావిస్తున్నారు.
అన్ని గ్రామాల్లో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగం గా మరుగుదొడ్డి నిర్మాణానికి అయ్యే ఖర్చులో రూ.12 వేలను స్త్రీనిధి ద్వారా రుణంగా ఇస్తారు. ఈ రుణాన్ని తిరిగి 12 నెలల్లో వడ్డీతో సహా చెల్లించాల్సి ఉం టుంది. ఒకవేళ ఆలోగా నిర్మాణ బిల్లు ప్రభుత్వం నుంచి ఇస్తే ఆ వెంటనే చెల్లించాలనే నిబంధన విధించారు.