సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు
నేలకొండపల్లి, న్యూస్‌లైన్: పోలవరం ఎత్తు తగ్గిస్తే ముంపు గ్రామాల సంఖ్యను తగ్గించాలని, (ముంపు) నిర్వాసితులకు పరిహారం పెంచాలని సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆయన శనివారం నేలకొండపల్లిలోని కర్నాటి కృష్ణయ్య భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ముంపు గ్రామాలన్నిటినీ జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ గ్రామాలను సీమాంధ్రలో కలపడం అనివార్యమైతే మాత్రం వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోల వరం ప్రాజెక్ట్ ఎత్తును 150 నుంచి 135 మీటర్లకు తగ్గిస్తే చాలా గ్రామాలకు ముంపు ముప్పు తగ్గుతుందని అన్నారు. ముంపు బాధితులకు నూతన చట్టం ప్రకారం ఎకరాకు ఐదులక్షల రూపాయలు పరిహారంగా ఇవ్వాలని, జిల్లాలోనే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీపీఐ శక్తివంచన లేకుండా కృషి చేసిందన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన కాంగ్రెస్, బీజేపీ, జేఏసీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రజలు ఐక్యతతో ఉండాలని ఆకాంక్షిచారు.
టీడీపీతో పొత్తు ఉండదు
మతోన్మాద బీజేపీతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల పొత్తు ఉండదని పువ్వాడ స్పష్టం చేశారు. అధికారం కోసం తహతహలాడుతున్న చంద్రబాబు ఇప్పటికే బీజేపీతో కలిసి చాలా దూరం వెళ్లారని అన్నారు. ఎన్నికలలో వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసయినా గెలవాలని ఆ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న పార్టీలతో, కలిసొచ్చే వారితో పొత్తుకు సీపీఐ సిద్ధంగా ఉందన్నారు. లేనట్టయితే జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ, ఖమ్మం పార్లమెంట్ స్థానాల్లో సీపీఐ అభ్యర్థులు బరిలో ఉంటాయని అన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిద్ధి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి భానుప్రసాద్, బైరవునిపల్లి సర్పంచ్ సీతారాములు పాల్గొన్నారు.