‘ఛీఛీ’ కెమేరాలు
గోదావరి పుష్కరాలు వచ్చి ఏడాదైపోయింది. అంత్య పుష్కరాలు మరో 24 గంటల్లో ప్రారంభంకానున్నాయి.
-
గత ఏడాది పుష్కరాల్లో ఏర్పాటు చేసిన 171 సీసీ కెమేరాలు ఏమైనట్టు?
-
తొక్కిసలాట లోగుట్టును అవెందుకు విప్పలేకపోయాయి?
-
అజ్ఞాతంలోకి ఎందుకు నెట్టేశారు?
-
గుట్టురట్టవుతుందనే భయమే దీనికి కారణమా?
-
పాతవి వదిలేసి కొత్తవాటితో మళ్లీ కసరత్తు
సీసీ కెమేరాలు ... పోలీసు యంత్రాంగానికి ఇవి మూడో కన్ను. కానీ ఆ కన్ను రాజకీయాల ఒత్తిళ్లతో మూతపడింది. ఎక్కడ తమ లోగుట్టు బట్టబయలవుతుందోనని బలవంతంగా కెమేరా కను రెప్పలను మూతేసేశారు. ఆ సాక్షా్యలు బయట పెట్టాలని స్వయంగా ఏకసభ్య కమిషన్ ఆదేశించినా చెవిటి వాడి ముందు శంఖం ఊదిన చందంగా తయారైందే గానీ ఫలితం మాత్రం కనిపించలేదు. సీసీ కెమేరాల్లో ఏముందో బయటపెట్టాలని ... çఫుటేజీలను బహిర్గతం చేయాలని విపక్షాలు ... ప్రజా సంఘాలు గగ్గోలు పెట్టినా దున్నపోతు మీద వర్షం పడిన చందంగా దులుపేసుకున్నారుగానీ వాస్తవాలతో జనం ముందుకు రాలేకపోయారు. ఏడాది అయిపోయింది... అంత్య పుష్కరాలు వచ్చేశాయి. మళ్లీ సీసీ కెమేరాల అంశం తెరపైకి వచ్చింది. జనం మాత్రం ఛీ...ఛీ కెమేరాలంటూ ఎగతాళి చేస్తున్నారు.
సాక్షిప్రతినిధి–కాకినాడ :
గోదావరి పుష్కరాలు వచ్చి ఏడాదైపోయింది. అంత్య పుష్కరాలు మరో 24 గంటల్లో ప్రారంభంకానున్నాయి. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పుష్కరాలు ఎంతో ఆర్భాటంగా నిర్వహించింది. ఇందుకోసం ఏకంగా రూ.1400 కోట్లకు పైనే ఖర్చుచేసింది. ఆ ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల విజ్ఞప్తిని పెడచెవిన పెట్టింది. గోదావరి పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివస్తుండడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా ఇట్టే పసిగట్టేందుకు భారీగా సీసీ కెమేరాలను ఏర్పాటు చేసింది. రాజమహేంద్రవరంలోని ఘాట్లతోపాటు నగరంలో 171 సీసీ కెమేరాలను ఏర్పాటు చేశారు. అదలా ఉంచితే తాజాగా అంత్య పుష్కరాలకు 40 సీసీ కెమేరాలను ఏర్పాటు చేసింది. స్థానికంగా ఉన్న నిర్వాహకులకే రెండు లక్షల రూపాయలకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ లెక్కన చూసుకుంటే 171 కెమేరాలకు సుమారు రూ.16 లక్షలు వెచ్చించి ఉంటారనే అంచనాలున్నాయి. ఈ ఖర్చు విషయాన్ని పక్కనబెడితే వాటి ద్వారా ఆశించిన లక్ష్యం నెరవేరకపోవడమేమిటనేదే జనం ప్రశ్న.
ఆ విషాద ఘటనకు సాక్షా్యలేవీ...
గోదావరి పుష్కరాల తొలిరోజు రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మృతిచెందడం ఎప్పటికీ మరిచిపోలేని విషాద ఘటనే. ఆ ఘటనకు సీఎం చంద్రబాబు వీఐపీ ఘాట్‌లో కాకుండా సామాన్య భక్తులతో రద్దీగా ఉండే పుష్కరఘాట్‌లో కుటుంబ సమేతంగా పూజలు చేయడమే కారణమని సంఘటన జరిగిన మరుక్షణం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జరిగిపోయిన ఆ ఘటనలో మృతులను తిరిగి తీసుకురాలేంగానీ లక్షలు ఖర్చుచేసి ఏర్పాటు చేసిన 171 సీసీ కెమేరాల పనితీరే వివాదాస్పదంగా మారింది. అసలు ఆ కెమేరాలు పనిచేయ లేదా, లేక ఆ ఘటన తరువాత ఉద్ధేశ్యపూర్వకంగా పనిచేయకుండా చేశారా అనేది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది. ఆ ఘటన ఎలా జరిగిందని తెలుసుకోడానికి సీసీ కెమేరాలు ..., సీసీ ఫుటేజీలే ఆధారం. అన్ని లక్షలు వెచ్చించి సీసీ కెమేరాలు ఏర్పాటుచేసి, అంత మంది పోలీసు, రెవెన్యూ అధికారులుండి కూడా ఏకసభ్య కమిషన్‌కు ఒక్కగానొక్క ఆధారాన్ని కూడా అందచేయలేకపోయారు. అవేవీ పని చేయలేదని దర్యాప్తులో తేల్చేశారు.
ఆ కెమేరాలను ఎందుకు వాడడం లేదు...
గత ఏడాది ఉపయోగించిన సీసీ కెమేరాలను పునరుద్ధరించి అంత్య పుష్కరాల్లో వినియోగించుకునే అవకాశం ఉన్నా ఆ ఆలోచనే చేయడం లేదన్న విమర్శలున్నాయి. అంత్య పుష్కరాలు ఏడాదిలో వస్తాయని ప్రభుత్వానికి, అధికారులకు తెలిసినా పట్టించుకోలేదు. ప్రస్తుతం ఘాట్లలో నామమాత్రంగా 40 సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కెమేరాల్లో 27 అధునాతనమైన కెమేరాలు శాశ్వతంగా ఘాట్‌లలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు ఏడు లక్షలు ఖర్చు అవుతోంది. సీపీజెడ్ కెమేరాలు, మినీ సీపీజెడ్ కెమేరాలు వీటిలో ఉన్నాయి.