
పులి మరణంపై కేంద్రం సీరియస్
వన్యప్రాణులకు రక్షణ కరువవ్వడంపై కేంద్ర పర్యావరణ శాఖ ఆగ్రహం
సాక్షి, మంచిర్యాల: అడవుల్లో వన్యప్రాణులే లక్ష్యంగా సాగుతున్న మారణకాండను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. రైతుల ముసుగులో పంట పొలాలకు రక్షణ సాకుతో వేటగాళ్లే వన్యప్రాణులను వధిస్తున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నిర్ధారించుకుంది. వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలకు కోటపల్లి మండలంలోని పిన్నారం గ్రామంలో మూడేళ్ల పులి బలైన విషయం ఈనెల 3న వెలుగు చూసింది. అయితే, ఈ సంఘటనపై విచారణకు కేంద్ర అటవీ పర్యావరణ రక్షణ సంస్థ లు సిద్ధమయ్యాయి.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోని కవ్వాల్ రిజర్వ్ ఫారెస్టు, చెన్నూరు డివిజన్‌లో నాలుగేళ్లలో 3 పులులు బలైనట్లు కేంద్ర ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. అలాగే, గత నెల 22న కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని బెజ్జూర్ రేంజ్‌లోని ఎట్టిగూడలో ఓ పులి చర్మాన్ని అధికారు లు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే పులిని హతమార్చినట్లు కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పులి హతం, విద్యుత్ తీగలు అమర్చడం, గతంలో జరిగిన సంఘటన లన్నింటినీ కలిపి రాష్ట్ర అటవీ శాఖ కేంద్ర ప్రభుత్వానికి, నేషనల్ టైగర్ కన్స ర్వేటివ్ అథారిటీ (ఎన్‌టీసీఏ)కి ప్రాథమిక నివేదిక పంపింది. కాగా, ఈ సంఘటనకు బాధ్యుల ను చేస్తూ బీట్ ఆఫీసర్ అంజారి, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ నగేష్‌లను ప్రభుత్వం శుక్రవారం సస్పెండ్ చేసింది.