కరీంనగర్: కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వలస కార్మికుడు దుబాయిలో మరణించాడు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం తాడూరు పంచాయతీ పాపయ్యపల్లికి చెందిన చెన్నవేని రాములు (41) గతేడాది ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు. అక్కడ మరికొందరితో కలసి ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే గురువారం రాత్రి రాములకు తీవ్ర గుండెపోటు వచ్చింది.
దీంతో అతడిని ఆసుపత్రికి తరలించేందుకు సహచరులు ప్రయత్నించారు. కానీ అతడు అప్పటికే మృతి చెందాడు. ఈ మరణవార్తను సహచరులు రాములు కుటుంబసభ్యులకు ఫోన్లో తెలిపారు. దీంతో అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. రాములుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.