ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి | chagamti speach | Sakshi
Sakshi News home page

ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి

Published Tue, May 23 2017 11:28 PM | Last Updated on Tue, Sep 5 2017 11:49 AM

chagamti speach

  • విద్యార్థులకు చాగంటి కోటేశ్వరరావు ఉద్బోధ
  • ముగిసిన వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు 
  • తిమ్మాపురం(కాకినాడ రూరల్‌) :
    ఆత్మ విశ్వాసంతో లక్ష్య సాధనకు ముందుకు సాగాలని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రసంగీకులు డాక్టర్‌ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. కాకినాడ రూరల్‌ తిమ్మాపురం ఆకొండి లక్ష్మి స్మారక గోశాల ఆవరణలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలకు వెళ్లే విద్యార్థులు ఎటువంటి భయాందోళనలు, ఒత్తిడికి గురి కాకూడదన్నారు. జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, కాలాన్ని వృథా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమగ్రతతో పని చేస్తే పరిపూర్ణమైన విజయం సాధిస్తారన్నారు. ప్రతి విద్యార్థి పరిశుభ్రత పాటిస్తూ పక్కవారిని కూడా పరిశుభ్రత పాటించేలా కృషి చేయాలని సూచించారు. దేశం ఏమి ఇచ్చిందని ఆలోచించకుండా దేశానికి మనం ఏమి ఇచ్చామనే కోణంలో ఆలోచించాలన్నారు. మనం బతుకుతూనే పక్కవారిని బతికించేందుకు చేతనైనంత సాయం చేయాలన్నారు. ధనం సాయం చేస్తే ఖర్చయిపోతుందని, దానాల్లో కల్లా విద్యాదానమే గొప్పదన్నారు. విద్యాదానంతో తరతరాలు గుర్తుండిపోతారన్నారు. మహనీయుల జీవిత చరిత్రలకు సంబంధించిన పుస్తకాలను రోజుకి కనీసం 10 లైన్లను చదవాల్సిందిగా తల్లిదండ్రులకు సూచించారు. ఏపీజే అబ్ధుల్‌ కలాం రాసిన ‘వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌’పుస్తకాన్ని తప్పనిసరిగా చదవాలన్నారు. సర్వేపల్లి రా«ధాకృష్ణ కోసం తెలుసుకుని ఆయన అడుగుజాడల్లో పయనించాలని కోరారు. సమాజం, దేశం పట్ల భక్తి, గౌరవభావాలు పెంపొందించుకోవాలన్నారు. మహనీయుల అడుగుజాడల్లో పయనించేందుకు యువత నడుం బిగించాలని కోరారు. మంచి పుస్తకాలు చదవడం, అవగాహనతో కూడిన విద్య నేర్చుకోవడం, చేసే ప్రతి పనిలో ప్రత్యేకత, సృజనాత్మకత ఉండాలన్నారు. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక చింతన ఉండాలన్నారు. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం రూపొందించిన విజయానికి పది సూత్రాలను తప్పకుండా పాటిస్తామంటూ శిక్షణ తరగతులకు హాజరైన విద్యార్థులతో ప్రతిజ్ఙ చేయించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, అధిక సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు, పలువురు ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement