‘ద గ్రేట్ డిక్టేటర్’ సినిమాలో చాప్లిన్ ద్విపాత్రాభినయం చేశాడు. ఒకటి – హిట్లర్ పాత్ర (డిక్టేటర్) రెండు – హిట్లర్ పోలికలతో ఉన్న క్షురకుడి పాత్ర.
వేల సంఖ్యలో సైనికులు బారులు తీరి ఉన్న సన్నివేశమది. వందల సంఖ్యలో మిలిట్రీ అధికారులు హిట్లర్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ మహాసభలో హిట్లర్ సైనికుల్ని ఉద్దేశించి మాట్లాడవలసి ఉంది. కానీ, ఆ సమయానికి అక్కడికి హిట్లర్ బదులు, అతని పోలికలతో ఉన్న క్షురకుడు చేరుకుంటాడు. అతనే హిట్లరనుకుని అధికారులు గౌరవ వందనం సమర్పించి అతణ్ణి వేదిక మీదికి తీసుకు వెళతారు. ఒక నిమిషం తడబడి ఆ తర్వాత – ఒక సామాన్యుడిగా తను కోరుకుంటున్నదేమిటో మాట్లాడతాడు. హిట్లర్‌ను ఎద్దేవా చేసే చార్లీ చాప్లిన్ తన అంత రంగాన్ని అతి సామాన్యుడైన క్షురకుడి పాత్ర ద్వారా ఈ విధంగా వ్యక్తం చేశాడు. ‘ద గ్రేట్ డిక్టేటర్’లోని ఉపన్యాసంముఖ్యాంశాలు ఇక్కడ మీకందిస్తున్నాను.
‘‘క్షమించాలి! నాకు చక్రవర్తిని కావాలని లేదు. అలాంటి ఉద్దేశమే లేదు. ఎవరినో జయించాలని కాని, ఎవరి మీదనో పెత్తనం చలాయించాలని కానీ నాకు లేదు. తెలుపు, నలుపు అన్న తేడా లేదు. ప్రతివారికీ చేయగలిగినంత సహాయం చేయాలనే ఉంది. మనం ఒకరికొకరం సహాయపడుకుంటూ ఉండాలి. ఎదుటివారి సంతోషమే మనకు స్ఫూర్తిని, సంతృప్తిని ఇస్తుంది. వారి దుఃఖం కాదు – ఒకరిని అసహ్యించుకోవడం, అవహేళన చేయడం మనం కోరుకోం. ఈ విశాల ప్రపంచం అందరిదీ. మన జీవితం స్వేచ్ఛకూ, ఆనందానికీ ప్రతిరూప మవ్వాలి! కానీ, మనం దారి తప్పుతున్నాం. స్వార్థం మనుషుల అంతరాత్మల్ని విషపూరితం చేస్తోంది. కుత్సితాలతో ప్రపంచాన్ని కుంచింపజేస్తోంది. వేగాన్ని అభివృద్ధి పరిచాం. నిజమే! కానీ, మనలో మనమే ముడుచుకుంటున్నాం. కావాల్సినవన్నీ యంత్రాలు తయారు చేస్తున్నాయి. కానీ, మన కోర్కెల దాహం తీరడం లేదు.
మన విజ్ఞానం మనల్ని మానవ ద్వేషులుగా చేస్తూ ఉంది. మన తెలివి తేటలు మనల్ని నిర్దయులుగా, కఠినాత్ములుగా తీర్చి దిద్దుతున్నాయి. యంత్రాల యంత్రాంగం కన్నా, మనకు మాన వత్వపు మనుగడ ముఖ్యం కావాలి. మితిమీరిన తెలివితేటల కన్నా మర్యాద, మన్నన, దయార్ద్ర హృదయం కావాలి. ఈ లక్ష ణాలు లేని జీవితం భయానకమై నశిస్తుంది. రేడియో, విమా నాలు మానవుల్ని దగ్గరి పరిధిలోకి చేరుస్తున్నాయి. మానవుని లోని మంచితనమే వీటిని కనుక్కోగలిగింది. విశ్వమానవ సౌభ్రా తృత్వాన్ని ఎలుగెత్తి చాటింది. ఈర్షా్య ద్వేషాలు నశిస్తాయి. నియంతలు నశిస్తారు. ప్రజల నుండి లాక్కున్న అధికారం మళ్ళీ, తిరిగి ప్రజలకే దక్కుతుంది. స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు నశించవు. తాత్కాలికంగా అణచబడ్డా, అవి సంకెళ్ళు తెంపుకొని ధైర్యంగా బతుకుతాయి. సైనికులారా ఆలోచించండి! మీకు తిండి పెట్టి, కసరత్తులు చేయించి, మిమ్మల్ని పూర్తిగా వాడుకునేవాడు ఎలాంటివాడో ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించండి.
మీరు పశువులు కాదు. గడ్డి పోచలు కాదు. మానవత్వం పట్ల మీకు అచంచల విశ్వాసం ఉంది. వీర సైనికులారా! స్వేచ్ఛ కోసం పోరాడండి. బానిసత్వం కోసం కాదు. యంత్రాల్ని సృష్టించుకోగల నేర్పరులు మీరే. యంత్రాలై పోకుండా మనుషులుగా నిలదొక్కుకునే ఆత్మశక్తి మీలోనే ఉంది. రండి! ప్రజాస్వామ్యం పేరిట ఏకమై, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుందాం! దురాశ, దుఃఖం, అసూయ, క్రూరత్వాలకు నిలువ నీడ లేకుండా చేద్దాం! శాస్త్ర సాంకేతికాభివృద్ధి సాధించే ప్రగతివైపు పయనిద్దాం.. రండి! అందరం ఏకమౌదాం!!’’ ఇది చాప్లిన్ ఉపన్యాసం. ఇక్కడ మరొక విశేషముంది. హిట్లర్‌ను చార్లీ చాప్లిన్ ఆటపట్టించాడు. కానీ, చాప్లిన్ అభిమానుల్లో హిట్లర్ ఒకడు!
ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ‘వరల్డ్ గ్రేటెస్ట్ ఎంటర్‌టెయినర్’గా, ప్రపంచాన్ని నవ్వుతో శాసించిన సర్ చార్లీ చాప్లిన్ (16 ఏప్రిల్ 1889 – 25 డిసెంబర్ 1977) తన విజయ రహస్యాన్ని తానే అనేకసార్లు బేరీజు వేసుకున్నాడు. ‘ఈ ప్రజలు దేన్ని చూసి నవ్వుతారు?’ అనే శీర్షికతో చాప్లిన్ 1918లో ఒక అమెరికా పత్రికకు వ్యాసం రాశాడు. అందులో ‘‘హాస్యం టోపీ ఎగిరిపోవడంలో లేదు. దాన్ని పట్టుకోవడానికి ఒక పెద్ద మనిషి పడే అవస్థలో ఉంది. ప్యాంటు – పిగిలిపోవడంలో లేదు. దాన్ని కప్పి పుచ్చుకోవడానికి పడే తికమకలో ఉంది. అలాగే జారి పోయే ప్యాంట్ వదిలేస్తే ఎవరికీ నవ్వు రాదు. కానీ, జారిపోకుండా పైకి అనుకుంటూ హడావిడి పడిపోవడంలో హాస్యం ఉంది. అమ్మాయి నగ్నత్వాన్ని ప్రదర్శిస్తున్న పోస్టర్‌ను, ఒక పెద్ద మనిషి నిలబడి తనివితీరా చూస్తుంటే ఎవరికీ నవ్వు రాదు. సమాజంలో తానొక పెద్ద మనిషినని గుర్తుంచుకుని అలా చూస్తూ ఉంటే తన వ్యక్తిత్వానికి దెబ్బ తగులుతుందని బాధ పడుతూ, ఉండలేకపోతూ, చూడనట్టు నటిస్తూ... చూస్తూ ఉండ టంలో హాస్యం ఉంది... బలహీనుడై ఉండి, పహిల్వాన్‌తో ఛాలెంజ్ చేయడం, తెలివిగా తన్నులు తప్పించుకుంటూ ఉండ టంలో హాస్యం ఉంది. హాస్యం కత్తి మీద సాములాంటిది. ఎక్కడ ఏ కొద్దిగా బెడిసి కొట్టినా హాస్యానికి బదులు జుగుప్స, ఏవగింపు, అసహ్యం కలుగుతాయి.
ప్రపంచాన్ని తరతరాలుగా కదిలిస్తూ వస్తున్న చార్లీ చాప్లిన్ సునిశిత హాస్యం ఎక్కడి నుంచో రాలేదు. జీవితాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్న చాప్లిన్ మేధలోంచి వచ్చింది. ‘‘నూటికి పదిమంది బాగా ఉన్నవాళ్ళూ, తొంభయిమంది లేనివాళ్ళూ ఉన్న ఈ సమాజంలో... 90 శాతం ప్రజల్ని నవ్వించడానికి, 10 శాతం మందిని గేలి చేయడంలో– తప్పేమిటి?’’ అన్నది ఆయన ప్రశ్న! వర్గ దృక్పథాన్ని ఇంత సులభంగా, సరళంగా చెప్పిన వాళ్ళు బహుశా ఎవరూ లేరేమో! హాస్యంతో మానవ వాదానికి ఊపునిచ్చిన మహనీయుడు కూడా మరొకరు లేరేమో!!
డా. దేవరాజు మహారాజు, వ్యాసకర్త సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవ శాస్త్రవేత్త
Comments
Please login to add a commentAdd a comment