స్నాచింగ్ జరిగిన క్రమాన్ని వివరిస్తున్న ఉపాధ్యాయురాలు రజని
♦ బరితెగించిన అగంతకుడు
♦ ఉపాధ్యాయురాలి మెడలో గొలుసు తెంచుకుని బైక్‌పై పరారీ
♦ వెంటాడినా దొరకలేదు
గుంటూరు ఈస్ట్ :
రద్దీగా ఉన్న జీడీసీసీ బ్యాంకు ముందు నడిచి వెళుతున్న ఉపాధ్యాయురాలి మెడలోని బంగారు గొలుసును ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి తెంచుకుని పరారైన సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. బ్రాడీపేట 2/10లో నివసించే రజనీ.. అదే రోడ్డులోని శారదానికేతన్‌లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం పాఠశాల నుంచి ఇంటికి వెళ్లి భోజనం చేసి తిరిగి వెళుతున్నారు. జీడీసీసీ బ్యాంకు సమీపంలోకి రాగానే గుర్తు తెలియని ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై ఆమెకు సమీపంగా వచ్చి మెడలోని నాలుగు సవర్ల బంగారు గొలుసును తెంచేందుకు ప్రయత్నించాడు.
రజని తీవ్రంగా ప్రతిఘటించారు. ఆమెను బలవంతంగా తోసివేసి పరారయ్యేందుకు యత్నించాడు. పెద్దగా కేకలు వేయడంతో సమీపంలోని సుమారు 10 మంది పట్టుకునేందుకు ప్రయత్నిం చారు. ద్విచక్ర వాహనానికి అడ్డుగా వచ్చినవారిని ఢీకొట్టేందుకు యత్నించాడు. దీంతో వారు పక్కకు తొలగడంతో వేగంగా దూసుకు వెళ్లాడు. 4/14 లైన్ చేరుకునే సరికి అగంతకుడి వాహనం వేగానికి అదుపు తప్పింది. అయినా వేగంగా కదిలి ముందుకు దూసుకుపోయాడు. స్థానికులు ద్విచక్రవాహనాలపై పట్టుకునేందుకు వెంబడించినా ఫలితం లేకపోయింది. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. సమీపంలోని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.