► అదనపు అంతస్తు నిర్మాణానికి లంచం డిమాండ్
► రూ.25 వేలు తీసుకుంటుండగా ఏసీబీ పట్టివేత
ఎన్‌ఏడీ జంక్షన్/జ్ఞానాపురం: జీవీఎంసీ టౌన్ ప్లానింగ్‌లో మరో లంచావతారం దొరికిపోయాడు. జోన్–4 పరిధిలో చైన్‌మన్‌గా పనిచేస్తున్న ఎన్.వి.తులసికుమార్ రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ పోర్ట్ ట్రస్ట్‌లో టైమ్ కీపర్‌గా పనిచేస్తున్న వెంకటరెడ్డి 41వ వార్డు 104 ఏరియాలో ఉంటున్నాడు. 60 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండో అంతస్తుకు శ్లాబ్ వేసుకుంటున్నాడు.
దీనిపై టౌన్‌ప్లానింగ్ చైన్‌మెన్ భవనాన్ని పరిశీలించాడు. అనుమతులు లేకుండా నిర్మాణాలు ఎలా చేపడతారని, వెంటనే అపేయాలని చెప్పాడు. అనంతరం వెంకటరెడ్డితో బేరసారాలు మొదలు పెట్టాడు. తమకు రూ.40 వేలు ఇవ్వాలని లేని పక్షంలో నోటీసులు ఇస్తామని, ఆ తరువాత భవనాన్ని కూల్చివేస్తామని హెచ్చరించారు. రెండు రోజుల తరువాత మళ్లీ డబ్బులు డిమాండ్ చేశాడు. ఎట్టకేలకు తులసికుమార్‌కు రూ.30 వేలు ముట్టజెప్పేందుకు అంగీకారానికి వచ్చారు.
ఈ నెల 4న తులసికుమార్‌కు వెంకటరెడ్డి రూ. 5వేలు చెల్లించాడు. మిగిలిన రూ.25 వేలు తీసుకునేందుకు సోమవారం సాయంత్రం పాత ఐటీఐ జంక్షన్‌కు చైన్‌మెన్ తులసికుమార్ ద్విచక్రవాహనంపై వచ్చాడు. అక్కడున్న భవన యజమాని వెంకటరెడ్డిని తన బైక్ ఎక్కించుకుని శారదా బేకరి వద్దకు చేరుకున్నాడు. అక్కడ వెంకటరెడ్డి నుంచి రూ.25 వేలు తీసుకుని చొక్కా పైజేబులో పెట్టుకున్నాడు. ఇంతలో మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు చైన్‌మెన్‌ను పట్టుకున్నారు. ఆ నోట్లను పరీక్షించి వెంకటరెడ్డి ఇచ్చినవిగా నిర్ధారించారు. ఈ లంచంలో ఇంకెవరికి భాగస్వామ్యం ఉందో విచారణ కొనసాగిస్తామని డీఎస్పీ రామకృష్ణ చెప్పారు. టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్ పాత్రపై విచారణ జరుపుతామన్నారు. నిందితుడు తులసికుమార్‌ను కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.
జోన్ –4 టీపీ విభాగం ఖాళీ
ఏసీబీ అధికారులకు చైన్‌మేన్ తులసికుమార్ దొరికిపోయాడన్న సమాచారంతో జ్ఞానాపురం జోన్–4 టౌన్‌ప్లానింగ్ విభాగం సిబ్బంది, అధికారులు త్వరగా విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. టౌన్‌ఫ్లానింగ్ విభాగంలో సోదాలు జరుగుతాయనే భయంతో హడావుడిగా ఇంటిముఖం పట్టారు. దీంతో జోన్–4 టౌన్‌ప్లానింగ్ కార్యాలయం ఖాళీగా కనిపించింది.