డబ్బుకు ‘దేశం’ దాసోహం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : అధినేత దగ్గర నుంచి అట్టడుగు వరకు డబ్బు డబ్బు..డబ్బు...అంతా డబ్బుమీదే నడుస్తోంది. పని కావాలంటే డబ్బు..పదవి కావాలంటే డబ్బు.. ‘డబ్బుకు లోకం దాసోహం...అన్నట్టుగా డబ్బుకు దాసోహం టీడీపీ అయిపోయిందన్న విమర్శలు ఆ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. ప్రత్తిపాడు మినీ మహానాడులో జిల్లాకు చెందిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, విశాఖ మహానా
- ఖరీదైన చైర్మన్ పీఠం
- బేరం రూ.15 లక్షలు పైమాటే
- ఇద్దరు నేతల మధ్య ఒప్పందం
మాటలు: కష్టపడే కార్యకర్తకు పట్టం కడతాం. జెండాను భుజాన మోసిన వ్యక్తికే పదవులు. పార్టీ అలాంటివారినే ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది...గుండెల్లో పెట్టుకుంటుంది తమ్ముళ్లూ ... మీరు పని చేయండి ... పార్టీ ప్రతిష్టను నిలబెట్టండి ... పదవులు అవే వస్తాయి. - మినీ మహానాడులో నుంచి విశాఖలో ముగిసిన మహానాడు వరకు జిల్లా నుంచి ఆ పార్టీ అధినేత చెప్పే మాటలివీ..
చేతలు: కష్టపడే నేతలు కాదు పార్టీ ‘పెద్దల’కు ఇష్టపడే నేతలుంటే చాలు పదవులు వాటికవే వచ్చి ఒడిలో వాలిపోతాయి. ఒక్క ఇష్టం ఉంటే సరిపోదండోయ్... కరెన్సీ తూకం సరిపోవాలి...అప్పుడు గతంలో ఇచ్చిన హామీలు ... ఒప్పంద పత్రాలన్నీ బలాదూర్. ఎవరి బేరం భేషుగ్గా ఉంటే పదవి పరుగులు తీసి వరించేస్తోంది. ఔనా అని ముక్కున వేలేసుకోకండి...ఈ కథనం చదివేయండి.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : అధినేత దగ్గర నుంచి అట్టడుగు వరకు డబ్బు డబ్బు..డబ్బు...అంతా డబ్బుమీదే నడుస్తోంది. పని కావాలంటే డబ్బు..పదవి కావాలంటే డబ్బు.. ‘డబ్బుకు లోకం దాసోహం...అన్నట్టుగా డబ్బుకు దాసోహం టీడీపీ అయిపోయిందన్న విమర్శలు ఆ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. ప్రత్తిపాడు మినీ మహానాడులో జిల్లాకు చెందిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, విశాఖ మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సహా మంత్రులు కార్యకర్తలు, నాయకులే పార్టీకి పట్టుగొమ్మలని చెప్పిన చిలక పలుకులు జిల్లాలో ఎక్కడా వినిపించడం లేదు. ఉదాహరణకు కోనసీమలోని నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గిరీనే తీసుకుందాం.ఆ వ్యవసాయ మార్కెట్ కమిటీ సుమారు కోటిన్నర వార్షిక ఆదాయంతో నడుస్తోంది. ఆ కమిటీ చైర్మన్ పదవీ కాలం గత మార్చి 20తో పూర్తయింది. కొత్త పాలకరవర్గాన్ని ఎంపిక చేయాల్సి ఉంది. ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో 30 గ్రామాలున్నాయి. రాజోలు నియోజకవర్గ పరిధిలో 14, పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలో 16 గ్రామాలు ఈ కమిటీలో ఉన్నాయి. ఈ చైర్మన్ గిరీకి జిల్లాలో డిమాండ్ ఎక్కువగా ఉంది. చైర్మన్ పీఠాన్ని రెండు నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు ఆశిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారు చైర్మన్ పదవి ఆశిస్తున్న మాటేమోగానీ ఆ ఆశలను ఆసరాగా పార్టీ ముఖ్యనేతలు సొమ్ము చేసుకోవాలని బాగా ఆరాటపడుతున్నారు.
ఆ హామీ ఏమయింది...?
మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వారికే చైర్మన్ పీఠం కట్టబెడతామని నిన్న మొన్నటి వరకు ఆశలు రేకెత్తించిన ముఖ్య నేతలు కాస్తా ఇప్పుడు ప్లేటు ఫిరాయించేశారు. చైర్మన్ పీఠాన్ని రూ.15 లక్షలకు బేరం పెట్టారు. పదవీ కాలం రెండేళ్లు మాత్రమే మిగిలి ఉండటంతో అందినంతా దోచుకోవాలనే తాపత్రయంలో పార్టీ సీనియర్లను సైతం పక్కనబెట్టేస్తున్నారని కేడర్‌లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత మార్చి వరకు చైర్మన్‌గా కొమ్ముల నాగబాబు కొనసాగారు. గత చైర్మన్ రేసులో నాగబాబుతోపాటు చివరకు మామిడికుదరు మండల టీడీపీ అధ్యక్షుడు సూదా వెంకట స్వామినా యుడు (బాబ్జీ) కూడా పోటీపడ్డారు. వివిధ సమ‘తూకా’ల్లో చివరకు నాగబాబుకే చైర్మన్ గిరీ దక్కింది. అప్పుడు నిరాశకు గురైన బాబ్జీకి వచ్చేసారి అంటే (ప్రస్తుతం) అవకాశం ఇస్తామని ఆ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేత హామీ ఇచ్చారు. హామీనే కాకుండా చైర్మన్ బాబ్జీకే ఇస్తామని కాగితంపై రాసి కూడా ఇస్తానని అప్పుడు బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని పార్టీ నేతలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. రెండేళ్లు గడిచే సరికి ఆ నాయకుడు ఇచ్చిన మాటలు గన్నవరం గోదావరిలో కలిపేశారు. చైర్మన్ పదవి మార్పు చేయాల్సి వచ్చేసరికి పార్టీలో సీన్ రివర్స్ అయింది. కరెన్సీ కట్టల ముందు పార్టీ కోసం సేవలు, క్రమశిక్షణ అనే మాటలు గాలిలో కలిపేశారు. కళ్లెదుట లక్షలు కనిపిస్తుంటే అవన్నీ ఎందుకు గుర్తుంటాయని నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
రహస్య ఒప్పంద నేపథ్యంలో...
రూ.15 లక్షలకు బేరం పెట్టి మరోసారి కూడా బాబ్జీకి అన్యాయం చేయడానికి వెనుకాడటం లేదని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. రాజోలు నియోజకవర్గానికి చెందిన ఒక ముఖ్యనేత శ్రీనుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సిఫార్సు కూడా చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మొదట్లో రాజోలు నియోజకవర్గ ప్రాతినిధ్యంలో ఉన్న ప్రాంతానికి చైర్మన్ ఇచ్చేది లేదని భీష్మించిన గన్నవరం నేత ఇటీవల కాస్త మెత్తపడ్డారంటున్నారు. పరస్పరం ఇచ్చిపుచ్చుకునే సర్థుబాటు జరగడంతోనే రహస్య ఒప్పందానికి వచ్చారంటున్నారు. రూ.15 లక్షల్లో పి. గన్నవరం ప్రాంత నేతకు రూ.10 లక్షలు, రాజోలు నేతకు రూ.5 లక్షలు ఇవ్వాలనేది ఒప్పంద సారాంసమని కోనసీమ కోడైకూస్తోంది. ఇన్ని లక్షలు ముడుపులు ముట్టచెబితే కమిటీ ద్వారా రైతులకు సేవలు ఎలా చేస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గతంలో అంబాజీపేట మార్కెట్ కమిటీ విషయంలో కూడా ఇలానే అప్పట్లో లక్షలు చేతులు మారాయనే విమర్శలు వచ్చాయి. ఇలా అయితే పార్టీ కోసం జెండా భుజాన మోసిన నేతలంతా ఏమైపోవాలనేది కార్యకర్తల ప్రశ్న. దీనికి నేతలు ఏమని సమాధానం చెబుతారో చూడాలి.