భక్తిప్రపత్తులతో చక్రతీర్థం
కోరుకొండ : కోరుకొండ దేవుని కోనేరులో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, శ్రీ చక్రపెరుమాళ్ళ స్వామిల చక్రతీర్థం వందలాది మంది భక్తుల సమక్షంలో ఆదివారం వైభవంగా జరిగింది. ఉదయం ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించాక రెండు పల్లకీలలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, శ్రీ పద్మనాభ స్వామి వార్లను, శ్రీ చక్రపెరుమాళ్ళు స్వామిని మంగళవాయిద్యాలతో వేలాది మంది భక్తులు అనుసరించగా గిరి ప్రదక్షణ చేస్తూ కోనేరు వద్దకు తీసుకెళ్ళారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం జరిపి చక్రతీర్థం నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్పీ రంగరాజభట్టర్, ఎస్పీ శ్రీ వాత్సవభట్టర్ స్వామి, అర్చకులు పెద్దింటి రంగాప్రసాద్, వాడపల్లి కిరణ్‌చక్రవర్తి, పాణింగిపల్లి సత్యపవన్‌ఆచార్య, డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్, ఎస్‌ఐ ఆర్.మురళీమోహన్, సర్పంచ్ కటకం అన్నపూర్ణచలం, అన్నవరం దేవస్థానం అధికారులు జగన్నాథరాజు, ప్రసాద్, తులారాం, టీఎన్ రాంజీ, ఎన్‌వీ రమణ తదితరులు పాల్గొన్నారు. చక్రతీర్థంలో ఉపయోగించిన నీటిలో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం స్వామి వార్లను ఆలయానికి పల్లకీలలో తీసుకువస్తుండగా గ్రామస్తులు రోడ్డును పసుపునీళ్ళతో కడిగి, ముగ్గులు వేసి స్వామిని దర్శించుకున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.