'ప్రత్యేక హోదా చంద్రబాబు అడగలేదు'
చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం పొందే సమయంలో ప్రత్యేక హోదా కావాలని అడిగింది వెంకయ్య నాయుడు, అరుణ్‌జైట్లీనేనని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. గురువారం చిత్తూరు జిల్లా పుత్తూరు పంచాయితీరాజ్ అతిథి గృహంలో గాలి ముద్దుకృష్ణమ నాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ గానీ, చంద్రబాబు నాయుడు గానీ విభజన బిల్లు ఆమోదం పొందే సమయంలో ప్రత్యేక హోదాను కోరలేదని ఆయన స్పష్టం చేశారు.
హోదా ఇస్తామన్నది కాంగ్రెస్ అయితే, అడిగింది బీజేపీయేనని ఆయన గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా వద్దని చంద్రబాబు ఏరోజూ చెప్పలేదన్నారు. ప్రత్యేక హోదా సెంటిమెంట్‌గా మారిందని, హామీని అమలు చేయకుండా బీజేపీ కాకమ్మ కబుర్లు చెబుతూ కాలం వెళ్లదీస్తోందని గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడు మండిపడ్డారు.
రాష్ట్రానికి రూ. లక్షా నలభై వేల కోట్లు సాయమందించామంటున్న బీజేపీ పెద్దలు ఏ పద్దుకింద... ఏ శాఖకు ఎంత నిధులిచ్చారో స్పష్టం చేయాలని గాలి ముద్దుకృష్ణమనాయుడు డిమాండ్ చేశారు. ఆర్థిక లోటు భర్తీకి రూ. 14 వేల కోట్లని తేల్చితే కేంద్రం మాత్రం ఇచ్చింది రూ. 2500 కోట్లేనని గాలి ముద్దుకృష్ణమ విమర్శించారు.