
ఆరోగ్యశ్రీని ఎత్తివేసే యోచనలో ఏపీ సర్కార్!
పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించడం కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏపీ సర్కార్ ఎత్తివేసేందుకు రంగం సిద్ధం చేసింది.
విజయవాడ: పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించడం కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏపీ సర్కార్ ఎత్తివేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఆరోగ్యశ్రీ పథకానికి ప్రత్యామ్నయంగా ‘హెల్త్ ఫర్ ఆల్’ (అందరికీ ఆరోగ్యం) పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రారంభించనున్నారు. ఒక్కో వ్యక్తి నుంచి నెలకు రూ.100 చొప్పున వసూలు చేసేలా ఈ పథకానికి రూపకల్పన చేశారు.
హెల్త్ ఫర్ ఆల్ కార్డులు ఇచ్చి... ఆరోగ్యశ్రీ కార్డులను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతి ఏటా పేదల ఆరోగ్యం కోసం ఖర్చవుతున్న రూ.1300 కోట్ల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పేదల నుంచి ప్రీమియం వసూలు చేసి...దాంతో తిరిగి వారికే వైద్యం అందించనుంది. ఇవాళ (శనివారం) జరిగిన సమావేశంలో ‘హెల్త్ ఫర్ ఆల్’ పథకానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.