సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రత్యేక హోదా విషయంలో రాజ్యసభలో మీ వల్లే కేంద్రాన్ని నిలదీయలేకపోయామని టీడీపీ ఎంపీలు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్పష్టం చేశారు. సభలో హోదాపై ఎప్పుడు ఏ వైఖరి తీసుకోవాలో తమకు సరైన సమయంలో సరైన సమాచారం అందలేదని, దీంతో అరుణ్‌జైట్లీ ప్రసంగం అనంతరం సరిగ్గా స్పందించకలేకపోయామని వారు తేల్చిచెప్పినట్లు సమాచారం. హోదా విషయంలో రాజ్యసభలో కేంద్రాన్ని నిలదీయడంలో టీడీపీ విఫలమైందన్న విమర్శల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నష్టనివారణ చర్యలు ప్రారంభించారు. ఆదివారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో టీడీపీ ఏపీ, తెలంగాణ ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.
రాజ్యసభలో మన ఎంపీల చర్యల వల్ల పార్టీ ఇబ్బంది పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన రాజ్యసభ సభ్యులు మిత్రపక్షంగా ఉండి కేంద్ర మంత్రి జైట్లీ సమాధానానికి వ్యతిరేకంగా వాకౌట్ చేస్తే పార్టీకి ఇబ్బందులు వస్తాయనే ఆలోచనతో మిన్నకుండిపోయామని చెప్పినట్లు తెలిసింది. సభలో ఎలా వ్యవహరించాలి? ఏం మాట్లాడాలి? అనే అంశాలను గతంలో మాదిరిగా చీటీలు రాసి పార్లమెంటరీ పార్టీ కార్యాలయం ద్వారా ఎప్పటికప్పుడు పంపుతున్నానని చంద్రబాబు చెప్పగా తమకు అవి ఆలస్యంగా అందాయని, ఈ సమాచార లోపం వల్లే పరిస్థితి ఇంత దాకా వచ్చిందని ఎంపీలు వివరించినట్లు తెలిసింది. భవిష్యత్‌లో సమాచార లోపం లేకుండా చూసుకుందామని చంద్రబాబు సర్ది చెప్పినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.
నాలుగు దశల్లో ఆందోళన
రాష్ర్టం పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ నాలుగు దశల్లో ఆందోళన చేపట్టాలని ఈ సమావేశంలో అనుకున్నట్లు తెలిసింది. తొలుత బాధను వ్యక్తం చేయటం, తరువాత ఆవేదన చెందటం, ఆ త రువాత ఆగ్రహం వ్యక్త పరచటం, అంతిమంగా ఆందోళన చేయటం అనే దశ లను ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. లోక్‌సభ, రాజ్యసభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడదామనే ప్రతిపాదనను సీఎం తిరస్కరించినట్లు సమాచారం. ఒకవైపు ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ ను కోరుతూ మరోవైపు వాయిదా తీర్మానం అంటే మంచి సంకేతాలు చంద్రబాబు చెప్పారు.
ప్రధాని అపాయింట్‌మెంట్ ఇస్తే ఇప్పటి వరకూ రాష్ట్రానికి ఏం చేశారు, ఇంకా ఏం చేయాలో వివరించనున్నారు. కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి తాము పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమని చెప్పారు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు సూచించారు. రాష్ట్రానికి హోదా ఎంత అవసరమో కేంద్రానికి తెలిపేలా వినూత్న తరహాలో నిరసనలు తెలుపుతామని రాష్ర్ట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.
మోదీకి ప్రధాన శత్రువు చంద్రబాబు: జేసీ
ప్రధాని నరేంద్ర మోదీకి ప్రధాన శత్రువు చంద్రబాబు అని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. మోదీ తరువాత ప్రధానమంత్రి పదవికి పోటీపడే వ్యక్తులు దేశంలో చంద్రబాబు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ మాత్రమేనని చెప్పారు. చంద్రబాబును ఎలా అణగదొక్కాలా? అని బీజేపీ నేతలు చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీతో టీడీపీకి విడాకులు తప్పవని, అది ఎప్పుడనేది వేచి చూడాలన్నారు.
అంతా మీ వల్లే జరిగింది
Published Mon, Aug 1 2016 2:40 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement