
ఓటుకు కోట్లు కేసుపై స్పందించిన చంద్రబాబు
ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేశారు.
విజయవాడ : ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడిన సందర్భంగా అడిగిన ప్రశ్నలకు ఆయన సూటిగా సమాధానమివ్వకుండా దాని గురించి నేను మాట్లాడటమేంటి? అంటూ దాటవేశారు. ఆ కేసులో ఏముందని మాట్లాడటానికి... అంటూ ఆ అంశాన్ని తేలికగా కొట్టిపారేసినట్టు కనిపించే ప్రయత్నం చేశారు. తేలికగా తీసివేయాలని ప్రయత్నించినప్పటికీ ఆ విషయాన్ని మా అడ్వకేట్లు చూసుకుంటారని పేర్కొన్నారు.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన ‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ప్రత్యేక కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే దర్యాప్తు నివేదికను సెప్టెంబరు 29లోగా సమర్పించాలని న్యాయమూర్తి సోమవారం ఏసీబీని ఆదేశించారు. ఓటుకు కోట్లు కుట్ర కేసులో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని, ఆయనపై అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 12, భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 120(బి)కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి(ఆర్కే) ఈనెల 8న ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. నేర విచారణ చట్టం సెక్షన్ 210 కింద విచారణ చేపట్టాలని ఆ ఫిర్యాదులో కోరిన సందర్భంలో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు జరపాలని కోర్టు ఆదేశించింది. ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ తో జరిపిన ఫోన్ సంభాషణలోని స్వరం చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన నివేదిక రుజువుచేస్తోందని పిటిషన్ లేవనెత్తిన అంశంపై ప్రాథమిక ఆధారాలు సమర్పించిన తర్వాత కోర్టు దర్యాప్తునకు ఆదేశించింది.
సోమవారం కోర్టు తీర్పు వెలువడిన తర్వాత చంద్రబాబు పలువురు న్యాయవాదులతో సమాలోచనలు జరిపారు. తదుపరి చర్యలపై చర్చించారు. మంగళవారం కరవు పరిస్థితులపై వివరాలను వెల్లడించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన సందర్భంగా విలేకరులు ఓటుకు నోట్లు కేసుపై కోర్టు ఆదేశాలను ప్రస్తావించారు. దానిపై ఆయన స్పందిస్తూ... ఆ కేసులో ఏముందో మీడియానే అధ్యయనం చేసి చెప్పాలని వ్యాఖ్యానించారు. దాని గురించి నేను మాట్లాడటమేంటి? మా అడ్వకేట్లు చూసుకుంటారు అంటూ దాటవేశారు.
ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టులో సవాలు చేయాలన్న అంశాన్ని పరిశీలించాలని చంద్రబాబు న్యాయవాదులకు చెప్పినట్టు సమాచారం. ఈ దర్యాప్తును ఏదో రకంగా నిలుపుదల చేయించని పక్షంలో తీవ్ర నష్టం జరిగే అవకాశాలున్నాయని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలావుండగా, కోర్టు తాజా ఆదేశాలపై ఏసీబీ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. తీర్పు ప్రతిని అధ్యయనం చేశారు. కోర్టు ఉత్తర్వులపై న్యాయ నిపుణుల సలహా తీసుకుని ఆ మేరకు తదుపరి దర్యాప్తును కొనసాగించాలని అధికారులు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.