మీడియాకు సీఎం రమేష్ పాఠాలు
ఓటుకు నోటు కేసులో ఏసీబీ నోటీసుల గురించి తనను ప్రశ్నించిన మీడియాకు తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ తనదైన శైలిలో పాఠాలు చెప్పారు. ఇప్పటివరకు అసలు ఎలాంటి పరిణామాలు జరగలేదని, వస్తున్నవన్నీ కేవలం వదంతులు మాత్రమేనని ఆయన అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సెటిలర్లను భయభ్రాంతులను చేసి తాము గెలవాలని టీఆర్ఎస్ అనుకుంటోందని ఆయన చెప్పారు. అసలు తన దగ్గరకు ఎందుకు వస్తున్నారని, నేరుగా పోయి ఏసీబీ అధికారులనే అడగాలని మీడియాకు సూచించారు. అసలు ఇలా లీకులు ఎందుకు ఇస్తారని వాళ్లను ప్రశ్నించాలని తెలిపారు. ఒక నిర్మాణ సంస్థ.. టీడీపీ ఆఫీసు దగ్గర్లో ఉంది, వాళ్ల బ్యాంకు ఖాతాల నుంచే డబ్బులు వెళ్లాయంటున్నారని, కానీ ఇది కనుక్కోవాలంటే ఏదో రాకెట్ సైన్స్లా పరిశోధించాల్సిన అవసరం లేదని సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. ఏసీబీ వాళ్లు బ్యాంకు దగ్గరకు పోయి అడిగితే తప్పనిసరిగా బ్యాంకు వాళ్లు ఇవ్వాలని చెప్పారు.
స్టీఫెన్సన్ ఇచ్చిన ఫిర్యాదు ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం తమకు చేతిలో అధికారం ఉందన్న సాకుతో నేరుగా ఏసీబీకి అప్పగించిందని తెలిపారు. అసలు ఈ కేసుతో తెలుగుదేశం పార్టీకే సంబంధం లేదని, తమ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారో లేదో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఏసీబీ నుంచి అదిగో ఇదుగో అంటే అందరూ పరిగెడుతున్నారు తప్ప మీడియా కూడా స్పష్టంగా ఏసీబీ వర్గాలను అడగట్లేదెందుకని ఆయన ఎదురు ప్రశ్నించారు. కేసులో రేవంత్ రెడ్డి డబ్బులతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు కదా.. అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, అవన్నీ ఎమ్మెల్యే బయటకు వచ్చిన తర్వాతే తెలుస్తుందంటూ సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు.