
కాల్‌మనీపై నోరువిప్పిన చంద్రబాబు
కాల్ మనీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి.
► విజయవాడలో కల్తీ ఎక్కువైంది
► నిన్న నెయ్యి, మొన్న మద్యం, ఇప్పుడు కాల్ మనీ
► పసిగట్టడంలో నిఘా వ్యవస్థలు విఫలం
► కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు
విజయవాడ: బెజవాడలో బెంబెలిత్తించిన కాల్ మనీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. విజయవాడలో సోమవారం ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు కాల్‌మనీపై నోరువిప్పారు. అన్నివైపుల నుంచి ఒత్తిళ్లు వస్తుండటంతో ఆయన స్పందించక తప్పలేదు. ఈ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ.. విజయవాడలో కల్తీ ఎక్కువ అయ్యిందని అని అన్నారు. మొన్న కల్తీ నెయ్యి, నిన్న కల్తీ మద్యం.. ఇప్పుడు కాల్‌మనీ అంటూ ధ్వజమెత్తారు.
కాల్‌మనీ వ్యవహారంలో నిఘా వ్యవస్థలు విఫలమయ్యాయని అన్నారు. ఈ దారుణాలను ముందుగా పసిగట్టడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. వీటిపై ముందే సమాచారం రావాల్సిందని చెప్పారు. ఈ వ్యవహారంలో చిక్కుకున్న బాధితులెవ్వరూ అప్పులు తిరిగి చెల్లించొద్దని తెలిపారు. మహిళలపై దారుణాలకు ఒడిగట్టిన వారిపై నిర్భయ కేసులు పెట్టాలని సూచించారు. రాజధానిపై నిఘా ఉంటుంది కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. కాల్‌మనీ లాంటి ఘటనల వల్ల ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇమేజ్ దెబ్బతింటుందని చంద్రబాబు తెలిపారు.