చుక్కలు చూపిస్తున్న ‘చంద్రన్న’ కానుక
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా లబ్ధిదారులకు చంద్రన్న కానుక పేరుతో ఉచితంగా సరుకులు పంపిణీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం చేతులెత్తేస్తోంది. సర్వర్‌లో తలెత్తిన సాంకేతిక కారణాల వల్ల మూడు రోజులుగా ఈ-పాస్ మిషన్లు సరిగా పని చేయడం లేదు. ప్రజలు రేషన్‌షాపుల వద్ద గంటల తరబడి వేచిచూస్తున్నా రోజుకు 20 నుంచి 30 కార్డులకు మించి సరుకులు అందడం లేదు. పరిస్థితి ఇలానే ఉంటే పండుగ రోజుకు లబ్ధిదారుల్లో సగం మందికి కూడా సరుకులు పంపిణీ పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
ఈ విషయాన్ని రేషన్ డీలర్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువైంది. సంక్రాంతి పండుగకు రూ. 270 విలువ చేసే అరకిలో కందిపప్పు, అరలీటర్ పామాయిల్, అరకిలో శనగపప్పు, అరకిలో బెల్లం, కిలో గోధుమ పిండి, 100 గ్రాముల నెయ్యితో కూడిన సరుకులను తెల్లరేషన్‌కార్డు దారులకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రోజు కూలీ రూ. 300 వదిలిపెట్టుకున్నా ఈ ఉచిత సరుకులు అందడం లేదని పేదలు వాపోతున్నారు.
శుక్రవారం 7 లక్షల మందికే కానుక
మూడు రోజులుగా చంద్రన్న కానుకను సరుకులను రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 28,254 రేషన్ షాపులు ఉంటే వీటిలో సర్వర్ సమస్య కారణంగా శుక్రవారం 8,388, శనివారం 5,175 షాపుల్లో ఒక్క లబ్ధిదారుడికి కూడా సరుకులు పంపిణీ చేయలేకపోయారు. కానుక కోసం 1.40 కోట్ల తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. అయితే శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల లబ్దిదారులకు మాత్రమే సరుకులు అందాయి. ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచిచూసి సరుకులు తీసుకోకుండానే వెనక్కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సంక్రాంతి పండుగలోపు సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ-పాస్‌తో సంబంధం లేకుండా రికార్డుల్లో సంతకం(మాన్యువల్) తీసుకొని సంక్రాంతి సరుకులు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
రేషన్ షాపులకు తాళం వేస్తాం..
గతేడాది కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో చాలా చోట్ల రేషన్ డీలర్లపై లబ్ధిదారులు దాడులు చేశారు. వాటిని దృష్టిలో ఉంచుకొని అలాంటి పరిస్థితి తిరిగి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డీలర్లు వాపోతున్నారు. మున్ముందు సర్వర్ సమస్య ఇలాగే కొనసాగితే డీలర్లందరూ రేషన్ షాపులకు తాళాలు వేసి వాటి తాళం చెవులను జాయింట్ కలెక్టర్లకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందని రేషన్ డీలర్ల సంఘం నేతలు పేర్కొంటున్నారు. వెంటనే క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించి ఇటు లబ్ధిదారులకు అటు రేషన్ డీలర్లకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని డీలర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివి లీలామాధవరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.