
వైభవంగా రథోత్సవం
నందలూరు :
జిల్లాలో ప్రసిద్ధిగాంచిన నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వరోజు బుధవారం భక్తుల కోలాహాలం మధ్య రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ముందుగా రథాన్ని శుభ్రపరిచి మామిడాకులు, రంగురంగుల పూలతో అలంకరించారు. కళశానికి పూజలునిర్వహించి రథం పైభాగాన అమర్చారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథస్వామి ఉత్సవమూర్తులను ఆగమశాస్త్ర పండితుల ఆధ్వర్యంలో రథంపైకి చేర్చారు. బూడిద గుమ్మడి కాయలను నాలుగు రథచక్రాల వద్ద ఉంచారు. వందల సంఖ్యలో హాజరైన భక్తులు గోవింద నామస్మరణల మధ్య రథాన్ని ముందుకు కదిలించారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. ఈ రథోత్సవంలో చెక్కభజన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్రహ్మోత్సవ కమిటీ చైర్మన్ యెద్దుల సుబ్బరాయుడు, ఆలయ ప్రతినిధి పల్లె సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.