ఆధారాలు చూపుతున్న రామాచారి
- రూ. 1.8 లక్షల తీసుకుని మోసం.. కేసు నమోదు
ఖమ్మం అర్బన్:
ఉద్యోగం కోసం ఆశ పడిన ఓ నిరుద్యోగిని అడ్డంగా దోచేశాడు ఓ వ్యక్తి. ఇంటిని తాకట్టు పెట్టి అప్పు చేసి రూ 1.8 లక్షలు చెల్లించితే తీసుకున్న వ్యక్తి గత 18 నెలలుగా తిప్పుకుంటున్నాడని బాధితుడి తండ్రి సంగోజీ రామాచారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రామాచారి తెలిపిన వివరాల ప్రకారం...నగరంలోని అగ్రహారానికి చెందిన సంగోజీ రామాచారి కుమారుడు నరేంద్రచారి ఎంబీఏ పూర్తి చేశారు. ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న సమయంలో ముస్తఫానగర్‌కు చెందిన బి. శ్రీను అనే వ్యక్తి తారసపడ్డాడు. ఐసీఐసీఐ బ్యాంకులో మేనేజర్ పోస్టు ఇప్పిస్తానని చెప్పి 18 నెలల క్రితం మూడు దఫాలుగా రూ. 1.8 లక్షలు తీసుకున్నాడు.
పలుమార్లు ఉద్యోగం లేదా డబ్బులు ఇవ్వాలని బాధితులు అడిగితే ఏదో ఒక సాకు చెప్పి కాలం వెళ్లదీస్తున్నాడు. ఈ విషయం గ్రామ పెద్దలకు చెప్పి అడిగించినా పట్టించుకోవడం లేదు. తమకు జరిగిన అన్యాయంపై బాధితుని తండ్రి అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగం ఆశతో ఇళ్లు తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తే ఉద్యోగం రాక పోగా తాను అప్పుల పాలైనట్లు తెలిపాడు. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నాడు.