సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డిలో ఇద్దరు రెవెన్యూ అధికారులపై చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసు రెండు నెలల క్రితమే నమోదు కాగా, తాజాగా సదరు అధికారులకు నోటీసులు జారీ చేయడంతో వ్యవహారం బయటకు పొక్కింది. పౌర సరఫరాల శాఖ బియ్యం పంపిణీలో అవకతవకలు జరిగాయని, సరుకుల పంపిణీ రిజిస్టర్‌లో ఫోర్జరీ సంతకం చేశారనే ఆరోపణలతో సంగారెడ్డి తహసీల్దారు గోవర్దన్, పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దార్ సురేశ్‌తోపాటు రేషన్ డీలర్ శంకర్‌పై మార్చి 17న సంగారెడ్డి పట్టణ పోలీసులు 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయాన్ని రెవెన్యూ శాఖ బాధ్యులకు కానీ, నేరారోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు తెలియకుండానే దాదాపు రెండు నెలలపాటు అత్యంత గోప్యంగా ఉంచారు. తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత రికార్డులు ఇవ్వాలని స్థానిక ఎస్‌ఐ గణేశ్ సోమవారం సంగారెడ్డి తహసీల్దారు గోవర్దన్‌కు నోటీసులు జారీ చేయడంతో వ్యవహారం బయటకు పొక్కింది.
అసలు కారణం...
సంగారెడ్డి పట్టణంలోని మంజీర నగర్ 16వ నంబర్ చౌకధర దుకాణంలో తిరుపతిరెడ్డికి రేషన్‌కార్డు ఉంది. తనకు కొంతకాలంగా బియ్యం ఇవ్వడం లేదని ఆయన రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించకపోవడంతో గత మార్చి నెలలో ఎస్పీ సుమతిని కలసి ఫిర్యాదు చేశారు. దీంతో బాధ్యులపై కేసు నమోదు చేయాలని పట్టణ సీఐ ఆంజనేయులును ఎస్పీ ఆదేశించారు.
అవినీతి ఎలా జరిగింది..?
తిరుపతిరెడ్డి పేరుతో ప్రతి నెలా బియ్యం తీసుకుంటున్నట్టు సరుకుల పంపిణీ నివేదికలో పొందుపరిచారు. బియ్యం తీసుకుంటున్నట్టు తిరుపతిరెడ్డి పేరుతో సంతకం కూడా ఉంది. తాను బియ్యం తీసుకోలేదని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని బాధితుడు ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు సంతకం ఫోర్జరీ చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు మార్చి 17న స్థానిక డీలర్ శంకర్, తహసీల్దార్ గోవర్దన్, డిప్యూటీ తహసీల్దార్ సురేష్‌ను బాధ్యులను చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా విషయం వెలుగు చూడడంతో పోలీసులు సదరు అధికారులను అరెస్టు చేస్తారా? లేక మధ్యే మార్గంలో రాజీ కుదిరించుకుంటారో వేచి చూడాల్సిందే. అయితే ఎస్పీ సుమతి రెవెన్యూ శాఖలో తలదూర్చి పలువురిపై కేసులు నమోదు చేసినప్పటికీ కలెక్టర్ రోనాల్డ్‌రాస్ మౌనం వహించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
అవినీతికి పాల్పడలేదు: డీలర్
తిరుపతిరెడ్డికి ప్రతినెలా 12 కిలోల బియ్యం కోటా వస్తుందని డీలర్ శంకర్ చెబుతున్నారు. ప్రతి నెలా ఆయన ఎవరినో ఒకరిని పంపుతారని, ఆయన పంపిన వ్యక్తికే బియ్యం పంపిణీ చేశామని పేర్కొన్నారు.
రెవెన్యూ అధికారులపై చీటింగ్ కేసు
Published Tue, May 17 2016 8:45 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM
Advertisement
Advertisement