
కష్టాల ‘చేనేత’
ఎంతో కళాత్మక నైపుణ్యం... అపూర్వ మేధా శక్తి కలగలసిన చేనేత రంగం శతాబ్దాలుగా ఎందరికో ఉపాధినిస్తోంది.
ప్రాచీన సంస్కృతికి ప్రతిబింబం
వ్యవసాయం తరువాత అధిక సంఖ్యలో ఉపాధి చూపుతున్న రంగం
ఎంతో కళాత్మక నైపుణ్యం... అపూర్వ మేధా శక్తి కలగలసిన చేనేత రంగం శతాబ్దాలుగా ఎందరికో ఉపాధినిస్తోంది. ప్రాచీన భారత దేశ సంస్కృతికి ప్రతిబింబమైన చేనేత రంగం... మారుతున్న కాలానికి అనుగుణంగా విభిన్న రకాల డిజైన్లతో రాణిస్తోంది. అందులోనూ ధర్మవరం పట్టు చీరలు అంతర్జాతీయ స్థాయిలో మగువల మనసును ఆకట్టుకుంటోంది. ఓ పట్టుచీర ఇంతటి ఖ్యాతి గడించడం వెనుక దాగి ఉన్న కార్మికుల శ్రమ ఈ ప్రపంచానికి అర్థం కాని ప్రశ్న. చేసిన పనికి గిట్టుబాటు కాకున్నా.. లాభాలు అంతంత మాత్రంగానే ఉన్నా.. ఏ మాత్రం ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా శ్రమనే పెట్టుబడిగా నమ్ముకుని చేనేత కార్మికులు ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహం ఇసుమంత కూడా లేకపోవడంతో చేనేత కార్మికులు దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు. కష్టాల ఊబిలో కూరుకుపోతున్న చేనేత రంగాన్ని బతికించుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. చేనేత కార్మికుల బతుకు చిత్రంపై సాక్షి ఫోకస్..
– ధర్మవరం:
జిల్లాలో మగ్గాలు :– 1,20,000
చేనేత కార్మికులు :–1,50,000
చేనేత అనుబంద రంగాల కార్మికులు :– 3,00,000
జిల్లాలో పట్టు చీరలు ఉత్పత్తి జరిగే ప్రాంతాలు : ధర్మవరం, హిందూపురం, ముదిరెడ్డిపల్లి, యాడికి, కోటంక, నార్పల, సోమందేపల్లి, ఉరవకొండ, గోరంట్ల, సిండికేట్ నగర్, తాడిపత్రి
పట్టుచీరల విక్రయ దుకాణాలు :– ధర్మవరం పట్టణంలో రెండు వేల వరకు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మరో 100కు పైగా ఉన్నాయి.
జిల్లా నుంచి పట్టుచీరలు ఎగుమతయ్యే ప్రాంతాలు : ఆంద్ర, తెలంగాణా, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, గుజరాత్‌లతోపాటు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
కరువుకు కేరాఫ్‌గా ఉన్న అనంతపురం జిల్లాలో వ్యవసాయం తరువాత అధిక సంఖ్యలో ఉపాధినందిస్తోంది చేనేత రంగం. ఇంతటి ఆదరణ ఉన్న రంగాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాయి. ఫలితంగా ప్రస్తుతం తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. పట్టుచీరలకు మద్దతు ధర లేకపోవడం, ముడి పట్టుధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడం ఒక కారణమైతే.. రాష్ట్ర ప్రభుత్వం నిరాదరణతో పాటు జీఎస్టీ పరిధిలోకి చేనేత రంగాన్ని కేంద్ర ప్రభుత్వం చేర్చి పన్నుల భారం మోపడం మరోకారణమైంది. గతంలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ నిలిపి వేయడం కూడా పరోక్షంగా చేనేత సంక్షోభానికి కారణమవుతోంది.
ఈ మూడేళ్ల వ్యవధిలో అప్పులు తీర్చే మార్గం కానరాక 60 మంది చేనేత కార్మికులు బలవన్మరణాలు పొందగా.. దాదాపు 50 వేల మంది చేనేత కార్మికులు కుటుంబాలతో సహా కేరళ, కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాలకు వలస వెళ్లి దినసరి కూలీలుగా మారి దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు.
నాపేరు అరుణజ్యోతి.. నా భర్త వెంకటరమణ కూడా చేనేత కార్మికుడే.. మాది తాడిపత్రి దగ్గర పప్పూరు గ్రామం. పదేళ్ల క్రితం ధర్మవరానికి వచ్చి మగ్గాలు నేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. పని బాగా జరిగితే. వారానికి ఒక చీర చొప్పున నేను రెడీ చేస్తాను. నేను నేసే చీర ఒకదానికి రూ. 2వేలు కూలి ఇస్తారు.. నా భర్త నేసే చీరకు రూ.2.500 కూలి వస్తుంది. మాకు ఒక కొడుకు ఉన్నాడు వాడ్ని బీఎస్‌ఆర్ స్కూల్‌లో 8వ తరగతి చదివిస్తున్నాం. పని బాగా జరిగితే పర్వాలేదు.. అన్‌సీజన్‌లో ఇబ్బంది పడుతున్నాం.
40 రూపాయలు కూలి ఉన్నప్పటి నుంచి మగ్గం నేస్తున్నాను. ఇప్పటికి 30 ఏళ్లుగా ఇదే పనిచేస్తున్నా.. అప్పటికి ఇప్పటికి ఏమీ మారలేదు ఏమీ ప్రయోజనం లేదు.. కనీసం పిల్లోల్లకు సరైన చదువు కూడా చెప్పించలేని స్థితిలో ఉన్నాం. ఇప్పడేమో కూలి ఓ మాదిరిగా ఉన్నా శారీరక శ్రమ ఎక్కువగా ఉంది. సూక్ష్మమైన పని కావడంతో అద్దాలు పెట్టుకుంటేకానీ పని చేయలేక పోతున్నాం.
– కుండా రామాంజినేయులు, చేనేత కార్మికుడు శివానగర్
పట్టుచీర తయారీ క్రమం
చేనేత పరిశ్రమకు మూలాధారం పట్టుగూళ్లే.. రైతులు పండించిన పట్టుగూళ్లను ధర్మవరం, హిందూపురం, చిత్తూరు జిల్లా పలమనేరు మార్కెట్‌లనుంచి కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకు వస్తుంటారు. వీటి నుంచి ఎంతో నైపుణ్యంతో దారం తీస్తుంటారు.
రీలింగ్ యూనిట్
మార్కెట్ల నుంచి తీసుకువచ్చిన పట్టుగూళ్లను రీలింగ్ సెంటర్‌లో తొలుత ఉడికిస్తారు.. గట్టిగా ఉన్న పట్టుగూడు మెత్తగా మారిన తరువాత దాని నుంచి దారాన్ని రీలింగ్ మిషన్ ద్వారా బాబిన్‌లకు చుడతారు. ధర్మవరం పట్టణంలో మొత్తం 30 వరకు రీలింగ్ యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్‌లో 15 నుంచి 50 మంది పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేసే కూలీలకు రోజుకు రూ.150 నుంచి రూ.160 వరకు కూలి ఇస్తుంటారు.
ట్విస్టింగ్ యూనిట్
రీలింగ్ యూనిట్‌లో తయారైన పట్టుదారాన్ని నాలుగు అంచెల్లో ట్విస్టింగ్ (దారం గట్టిపడేలా ముడిపెట్టడం) చేస్తారు. ఇక్కడే పట్టు చీర తయారీకి కావాల్సిన ముడిపట్టు తయారవుతుంది. నాలుగైదు రేషం దారాలను ట్విస్టింగ్ చేసి వార్పు (నిలువు దారం), సప్పురి (అడ్డదారం)లను తయారు చేస్తారు. మగ్గాల యజమానులు అడిగిన మేరకు వార్పులు తయారు చేసి ఇస్తుంటారు. ఇక్కడ పనిచేసే కూలీలకు గంటల ప్రకారం కూలి చెల్లిస్తారు. గంటకు రూ. 40 చొప్పున ఎన్ని గంటలు పని చేస్తే అంత మొత్తం కూలీలకు లభిస్తుంది.
రంగుల అద్దకం
ట్విస్టింగ్ యూనిట్‌లో తయారైన ముడిపట్టును మగ్గాల యజమానులు కొనుగోలు చేసి రంగుల అద్దకానికి ఇస్తారు. ఇక్కడ తమకు కావాల్సిన రంగులను అద్దకం యూనిట్ నిర్వహకులతో చెప్పి చేయించుకుంటారు. ధర్మవరం పట్టణంలో రంగుల అద్దకం ఫ్యాక్టరీలు దాదాపు 150 వరకు ఉన్నాయి. జిల్లాలో అధిక సంఖ్యలో చేనేత కార్మికులు ధర్మవరం పట్టణంలోనే తమకు కావాల్సిన రంగులను అద్దించుకుంటారు.
వార్పులు పట్డడం
ముడిపట్టుకు రంగులు అద్దిన తరువాత దారం చెల్లాచెదురుగా మారిపోతుంది. అలా చెల్లాచెదరుగా మారిన రేషాన్ని వార్పు పట్టడం ద్వారా సక్రమంగా తయారు చేస్తారు. తెగిపోయిన పోగులను తిరిగి అతికించి, మగ్గంపై పట్టుచీరలను తయారు చేసేందుకు వీలుగా చేస్తారు. ఈ వార్పులు పట్టడం ద్వారా చాలా మంది ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ వార్పు పట్టేపనిని ఎక్కువగా చేస్తుంటారు. వార్పులను పట్టేందుకు రూ. 200 వరకు కూలి తీసుకుంటారు. రోజుకు నలుగురు కలిసి ఐదు వార్పులు చేస్తారు.
జరీ పోయడం
పట్టుచీరలకు ముడిరేషం తోపాటు అంచులకు, చీర అందంగా కనిపించేందుకు జరీని ఉపయోగిస్తారు. బిల్లల నుంచి పెద్ద రాట్నానికి చుట్టి పట్టుచీర తయారు చేసేందుకు వీలుగా చేసి ఇస్తారు. ఒక మగ్గానికి అవసరమయ్యే జరీని తయారు చేయడానికి రూ. 50 వరకు తీసుకుంటారు. ఒక రోజుకు బాగా పని ఉంటే 4,5 మగ్గాలకు జరీని చేసి ఇస్తారు.
బోట్లు చుట్టడం
పట్టుచీరకు వినియోగించే సప్పురిని తొలుత బోట్‌కు చుట్టుకుంటారు. ఇలా చుట్టుకున్న దారాన్ని మగ్గంలో నేస్తారు. ఈ బోట్లు కొందరు కూలికి చుట్టించుకుంటే.. మరికొందరు చేనేత కార్మికులు తామే సొంతంగా చుట్టుకుని మగ్గాలు నేస్తారు. కిలో రేషాన్ని బోట్లు చుట్టేందుకు రూ. 100 నుంచి రూ.150 వరకు కూలి తీసుకుంటారు. ముఖ్యంగా ఇంట్లో ఉన్న పిల్లలు, మహిళలు, వృద్దులు ఎక్కువగా ఈ పని చేస్తుంటారు.
మగ్గం నేయడం
వార్పు, రేషం, జరీ అన్ని సిద్దమైన తరువాత పట్టుచీరను నేయడం మొదలు పెడతారు. రకాన్ని బట్టి ఒక్కో పట్టుచీరను నాలుగు నుంచి 15 రోజుల దాకా నేస్తారు. పట్టు చీర తయారీలో ఒక్కో రకానికి ఒక్కో రకమైప కూలి లభిస్తుంటుంది. సాధారణ రకాలు అయితే రూ.1,500 నుంచి పూర్తి డిజైన్లు ఉన్న రకాలు అయితే దాదాపు రూ.5,000 వరకు కూలి ఇస్తారు.
పట్టుచీర
చేనేత కార్మికుడు వారం నుంచి పది రోజుల పాటు కష్టపడితే ఒక పట్టుచీర సిద్ధమవుతుంది. ఇలా తయారైన పట్టుచీరలను చేనేత కార్మికులు నేరుగా శిల్క్‌హౌస్‌లకు/ ముడిసరుకులు ఇచ్చే ధనీలకు విక్రయిస్తారు. అక్కడి నుంచి వినియోగదారులకు చేరుతుంది.