చెరువుకు శోకం.. రైతుకు శాపం | CHERUVUKU SOKAM.. RIATUKU SAAPAM | Sakshi
Sakshi News home page

చెరువుకు శోకం.. రైతుకు శాపం

Published Mon, Jun 12 2017 11:59 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 PM

చెరువుకు శోకం.. రైతుకు శాపం

చెరువుకు శోకం.. రైతుకు శాపం

 టి.నరసాపురం : మెట్ట ప్రాంతంలోని సాగునీటి చెరువులు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కుచించుకుపోతున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. సాగునీటి ఎద్దడి తలెత్తి రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. తాగునీటికీ కటకటలు తప్పడం లేదు. చెరువుల్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నీరు–చెట్టు పథకాన్ని అమలు చేస్తున్నా ఆచరణలో అంతంతమాత్రంగానే ఉంది. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ పథకాన్ని చెరబట్టారు. నిధులు.. చెరువుల్లోని మట్టిపైన కన్నేసి అసలు లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. అక్కడక్కడా పనులు చేపట్టినా ఆక్రమణలు తొలగించకుండా తూతూమంత్రంగా మట్టి తొలగించి అమ్ముకోవడానికే పరిమితమయ్యారు. 
 
వర్షాకాలం వచ్చినా..
తొలకరి వర్షాలు జిల్లాను పలకరించాయి. వేసవిలో పూర్తిగా ఎండిపోయిన చెరువులు నేడోరేపో నీటితో నిండే అవకాశాలున్నా రైతులకు అక్కరకు వచ్చే పరిస్థితి లేదు. వీటి కళింగలు శిథిలమయ్యాయి. ఇన్‌లెట్, అవుట్‌ లెట్స్‌ పూడుకుపోయాయి. దీనివల్ల చెరువుల్లోని నీరు పొలా ల్లోకి పారే అవకాశం లేకుండా పోయింది. భారీ వర్షాలు కురిసినప్పుడు చెరువులు పొంగితే మాత్రం పొలాలన్నీ నీటమునిగి పంట నష్టం ఏర్పడుతోంది. జిల్లాలో 100 ఎకరాలకు పైగా విస్తీర్ణం గల సాగునీటి చెరువులు 450 ఉండగా, సాధారణ, మధ్యస్థాయి చెరువులు 3,100 ఉన్నాయి. మొత్తంగా ఈ చెరువులన్నీ 1.80 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేస్తే మెట్ట ప్రాంతంలో దాదాపు 10 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీంతో రైతుల కష్టాలు తీరిపోతాయి. కానీ.. చెరువుల అభివృద్ధిపై ప్రభుత్వం కనీస శ్రద్ధ కూడా చూపటం లేదు. జిల్లాలోని అన్ని చెరువులు ఆక్రమణల బారినపడి బక్కచిక్కాయి. 
 
జమ్మి చెరువు పెద్ద ఉదాహరణ
టి.నరసాపురం మండలం ముక్కినవారి గూడెంలో 108 ఎకరాల విస్తీర్ణంలో జమ్మి చెరువు ఉంది. దీనిని మినీ రిజర్వాయర్‌గా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన నేటికీ అమలుకు నోచుకోలేదు. ఈ చెరువు ఎగువ, దిగువ తూముల కింద 3 వేల ఎకరాల ఆయకట్టులో పంటలు సాగయ్యేవి. చెరువులో నీరుండటం వల్ల భూగర్భ జలమట్టం పెరిగి 10 గ్రామాల్లోని పొలాలకు మేలు కలిగేది. ఈ చెరువు లోతట్టులో దాదాపు 40 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. ఎక్కడికక్కడ మడులు కట్టి మరీ వ్యవసాయం చేస్తున్నారు. గత ఏడాది కురిసిన వర్షాలకు చెరువు నిండి కళింగ పక్కన గండి పడింది. 6 వేల ఇసుక బస్తాలు వేసి గండిని తాత్కాలికంగా పూడ్చారు. ఈ చెరువు తూములు సైతం శిథిలావస్థకు చేరాయి. గత ఏడాది వేసిన ఇసుక బస్తాలు చివికిపోయాయి. ఇదే ప్రాంతంలో గండిపడే ప్రమాదం పొంచివుంది. అదే జరిగితే సమీపంలోని 3 వేల ఎకరాల్లో పంటలు నీటమునిగి రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. గండిపడితే ఆ పొలాల్లో ఇసుక మేటలు వేసే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జమ్మిచెరువులోని ఆక్రమణల్ని తొలగించి.. మరమ్మతులు చేపట్టాలని ఏళ్ల తరబడి రైతులు కోరుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితి ఒక్క జమ్మి చెరువుకే పరిమితం కాలేదు. మెట్టలోని అన్ని చెరువులు ఇలాంటి దుస్థితిలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. 
 
కొత్త తూములు కట్టిస్తాం
జమ్మిచెరువుకు తిరిగి గండిపడే అవకాశాలు ఉన్న విషయాన్ని ఇరిగేషన్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఎస్‌.ఇమ్మానియేల్‌ దృష్టికి తీసుకెళ్లగా.. రెండు కొత్త తూములు నిర్మించేందుకు రూ.20 లక్షలు మంజూరయ్యాయని చెప్పారు. చెరువు కళింగను పూర్తిస్థాయిలో ఆధునికీకరించడానికి రూ.కోటి ఖర్చవుతుందని అంచనా వేసి, ప్రభుత్వానికి నివేదించామని చెప్పారు. నిధులొస్తే ఆ పనులు చేపడతామన్నారు. గొలుసుకట్టు చెరువుల అభివృద్ధిలో భాగంగా ఏనుగుబంధం చెరువు, చింతల చెరువుకు రూ.4.50 లక్షల చొప్పున మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో ఆ చెరువులకు తూములు నిర్మిస్తున్నామన్నారు.
 
మళ్లీ గండి తప్పదు
వర్షాకాలం నెత్తిమీదకు వచ్చింది. గత ఏడాది జమ్మి చెరువు కట్టకు గండిపడింది. తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేశారు. పటిష్టమైన చర్యలు చేపట్టలేదు. ఈ ఏడాది ఏ మాత్రం వర్షాలు పడినా గండిపడి పొలాలు నీట మునుగుతాయి. ఇసుక మేటలు వేస్తాయి. అధికారులు యుద్ధ 
ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. 
– మక్కిన వెంకట గోపాలరావు, మాజీ సర్పంచ్‌
 
పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి
మెట్ట ప్రాంతంలోని చెరువులన్నీ ఆక్రమణల బారినపడ్డాయి. తూములు, కళింగలు శిథిలావస్థకు చేరాయి. మరమ్మతులు చేయకపోవడంతో ఏటా రైతులు నష్టపోతున్నారు. భూగర్భ జలాలు పడిపోయాయి. అతిపెద్దదైన జమ్మిచెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి. చెరువు కట్టకు గండిపడకుండా వెంటనే చర్యలు చేపట్టాలి. అన్ని చెరువుల్లో ఆక్రమణలు తొలగించాలి. 
– ఆకుల శ్రీను, రైతు, మక్కినవారి గూడెం
 
ప్రధాన పనులు వదిలేసి..
ఎంతో ప్రాధాన్యత ఉన్న జమ్మి చెరువు అభివృద్ధిని గాలికొదిలేశారు. ఎందుకూ పనికిరాని ఏనుగు బంధం, చింతల చెరువులకు కొత్తగా తూములు కట్టిస్తున్నారు. ఆ చెరువుల కింద సాగయ్యే విస్తీర్ణం లేదు. నీరు పారే అవకాశం కూడా లేదు. అయినా అటువంటి చెరువులకు వృథాగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. రైతులందరికీ ఉపయోగపడే జమ్మి చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి. 
– సిరిమళ్ల వెంకట సత్యనారాయణ, రైతు, మక్కినవారి గూడెం 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement