సెరిబ్రల్ మలేరియాతో చిన్నారి కన్నుమూత
(ఆగూరు) మెంటాడ : మండలంలోని ఆగూరుకు చెందిన సింగంపల్లి సత్యనారాయణ, సత్యవతి దంపతుల కుమార్తె ప్రణతి(4) సెరిబ్రల్ మలేరియాతో మరణించింది. వివరాలు ఇలా ఉన్నాయి. కొద్ది రోజుల కిందట ప్రణతికి జ్వరం రావడంతో తల్లిదండ్రులు గజపతినగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం విజయనగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని సూచించారు. దీంతో సత్యనారాయణ దంపతులు తమ కుమార్తెను విజయనగరంలోని ఆస్పత్రిలో చూపించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో విశాఖపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మంగళవారం అర్ధరాత్రి కన్నుమూసింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అదే గ్రామంలో రెడ్డి నారాయణమ్మ, చల్ల అప్పలనాయుడు, చల్ల కళ, సింగంపల్లి సింహాచలం, రెడ్డి సౌమ్య, కోడూరు సత్యనారాయణ, తదితరులు జ్వరాలతో బాధపడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు.