Mentada mandal
-
అమరాయవలసలో హైవేకు అడ్డంగా కంచె
మెంటాడ (విజయనగరం జిల్లా): విశాఖపట్నం– రాయపూర్ హరిత రహదారి పనులను విజయనగరం హెచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం అడ్డుకుంది. రోడ్డు విస్తరణ పనుల కోసం తమ నుంచి సేకరించిన నాలుగు ఎకరాల భూమికి పరిహారం చెల్లించలేదని ఆరోపిస్తూ మెంటాడ మండలం అమరాయవలస వద్ద మంగళవారం రాత్రి రోడ్డుకు అడ్డంగా స్తంభాలు వేసి కంచె నిర్మించింది. పరిహారం అందించే వరకు కంచె తొలగించేది లేదని హెచరీస్ యాజమాన్య ప్రతినిధులు స్థానిక విలేకరులకు తెలిపారు. రోడ్డు పనులు పూర్తవుతున్నా జాతీయ రహ దారి అధికారులు పరిహారం చెల్లించేందుకు చొరవ చూపడంలేదని ఆరోపించారు. అందువల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ విషయం హైవే అధికారులకు తెలియనట్టు సమాచారం. (క్లిక్: హంగేరీ క్రికెట్ జట్టులో రాణిస్తున్న సిరిపురం కుర్రోడు) -
కనుమ రోజు సంక్రాంతి
సాక్షి, మెంటాడ: విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని గుర్ల గ్రామంలో సంక్రాంతి పండగను వినూత్నంగా జరుపుతారు. భోగి పండగను యధావిధిగా జరుపుకొని సంక్రాంతి పండగను మాత్రం కనుమ రోజు నిర్వహిస్తారు. కనుమ పండుగను ఆ మరుసటి రోజున చేసుకుంటారు. గ్రామంలో కాపు, వెలమ సామాజిక వర్గాలు భోగి మర్నాడు సంక్రాంతి పండగ నిర్వహించరు. కనుమ రోజు సంక్రాంతిని జరుపుతారు. దీనికి కారణాలు చెప్పలేకపోయినా ఇది తరతరాలుగా వస్తున్న ఆచారంగా వారు చెబుతారు. గండ్రేటి కుటుంబీకులు కోట గండ్రేటి నుంచి, పల్లి కుటుంబీకులు పల్లె గండ్రేడ నుంచి ఈ ప్రాంతానికి వచ్చారు. ఊర్లు మారినా వంశాచారాన్ని వారు వీడలేదు. గండ్రేటి వారు, పల్లివారు బంధువులు. గండ్రేటి వారి బాటలోనే పల్లి కుటుంబీకులు కూడా నడుస్తున్నారు. మృతి చెందిన పెద్దలు, పిన్నలకు కనుమ రోజున నైవేద్యం పెడతారు. మరునాడు (కనుమ) పశువులకు నూనె, పసుపు రాసి స్నానం చేయించి పూజలు చేస్తారు. వాటికి పిండి వంటలు పెడతారు. మిగిలిన వైశ్య, తెలగ, సామాజిక వర్గాలు మాత్రం సంక్రాంతిని యధావిధిగా భోగి పండగ తర్వాత జరుపుకొంటాయి. పండగ మార్పు తమకు ఆనందంగా ఉందని.. ఈ ఆచారాన్ని పాటించే కుటుంబాల మహిళలు తెలిపారు. తమ పుట్టింట్లో భోగి, సంక్రాంతి, కనుమ చేసుకొని అత్తింటికి సంక్రాంతి పండగకు వస్తారు. వారు జరుపుకొనే కనుమ పండుగకు పరిసరాల గ్రామస్తులు వస్తారు. సంక్రాంతి రోజు భోగి నారాయణపురంలో ఆచారం బలిజిపేట: నారాయణపురం దేవాంగుల వీధిలో సంక్రాంతి రోజు భోగి పండగ జరుపుకొంటారు. కొన్నేళ్ల క్రితం దేవాంగులకు చెందిన నేత మగ్గాలు, ఇతరత్రా సరుకులు నారాయణపురానికి చెందిన రైతులు భోగి మంటలో పడవేశారని.. ఆగ్రహించిన కూడా రైతుల నాగళ్లు, నాటుబళ్ల సామగ్రిని సంక్రాంతి రోజున భోగి మంటల్లో పడవేశారని స్థానికులు చెబుతున్నారు. అప్పటినుంచి నారాయణపురంలో మాత్రమే దేవాంగులు భోగి రోజు వేయాల్సిన మంటను సంక్రాంతి రోజు వేస్తుంటారని తెలిపారు. -
టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి..
మెంటాడ: మెంటాడ మండలంలో వైఎస్సార్ సీపీకి మరింత ఆదరణ లభిస్తోంది. మండలంలోని చల్లపేటలో మాజీ సర్పంచ్లు జి.భాగ్యలక్ష్మి, తాడ్డి అరుణ, మాజీ ఎంపీటీసీ జి.సత్యశ్రీనివాసరావు, మెంటాడ పీఏసీఎస్ అధ్యక్షుడు తాడ్డి రామచంద్రరావు ఆధ్వర్యంలో ఆదివారం అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ చప్ప సూర్య కుమారి, తాడ్డి తనూష, విశ్రాంత ఉపాధ్యాయులు చప్ప సూర్యం, తాడ్డి గోవిందరావు, మిత్తిరెడ్డి గోపాలం తో పాటు సుమారు 200 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరాయి. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్యలు పార్టీ కండువాలు కప్పి వారిని సాదారంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మాట్లాడుతూ సీఎం జగన్మోహన్రెడ్డి సాలూరు నియోజకవర్గ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేశారన్నారు. జేకే నిధులు మంజూరయ్యాయని ఆండ్ర హైలెవెల్ కెనాల్ పూర్తి చేసి ఏన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న 17 గ్రామాల రైతులకు చెందిన 4100 ఎకరాలకు అదనపు సాగునీరు అందిస్తామని రైతులు అడిగిన ప్రశ్నకు ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అప్పలనరసయ్య మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేరుగా అందించాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ రెడ్డి సన్యాసినాయుడు, యువజన అధ్యక్షుడు రాయిపిల్లి రామారావు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు వడ్డి చిన్నారావు, సాలూరు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు సిరిపురపు నాగమణి, సాలూరు నియోజకవర్గం నాయకులు దండి శ్రీను, సువ్వాడ రమణ, హేమంత్, మాజీ ఎంపీపీలు శొంఠ్యాణ సింహాచలం, కొర్రాయి కళావతి, ఏఎంసీ మాజీ చైర్మన్ పొరిపిరెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు. -
సెరిబ్రల్ మలేరియాతో చిన్నారి కన్నుమూత
(ఆగూరు) మెంటాడ : మండలంలోని ఆగూరుకు చెందిన సింగంపల్లి సత్యనారాయణ, సత్యవతి దంపతుల కుమార్తె ప్రణతి(4) సెరిబ్రల్ మలేరియాతో మరణించింది. వివరాలు ఇలా ఉన్నాయి. కొద్ది రోజుల కిందట ప్రణతికి జ్వరం రావడంతో తల్లిదండ్రులు గజపతినగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం విజయనగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని సూచించారు. దీంతో సత్యనారాయణ దంపతులు తమ కుమార్తెను విజయనగరంలోని ఆస్పత్రిలో చూపించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో విశాఖపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మంగళవారం అర్ధరాత్రి కన్నుమూసింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అదే గ్రామంలో రెడ్డి నారాయణమ్మ, చల్ల అప్పలనాయుడు, చల్ల కళ, సింగంపల్లి సింహాచలం, రెడ్డి సౌమ్య, కోడూరు సత్యనారాయణ, తదితరులు జ్వరాలతో బాధపడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు.