సాక్షి, మెంటాడ: విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని గుర్ల గ్రామంలో సంక్రాంతి పండగను వినూత్నంగా జరుపుతారు. భోగి పండగను యధావిధిగా జరుపుకొని సంక్రాంతి పండగను మాత్రం కనుమ రోజు నిర్వహిస్తారు. కనుమ పండుగను ఆ మరుసటి రోజున చేసుకుంటారు. గ్రామంలో కాపు, వెలమ సామాజిక వర్గాలు భోగి మర్నాడు సంక్రాంతి పండగ నిర్వహించరు. కనుమ రోజు సంక్రాంతిని జరుపుతారు. దీనికి కారణాలు చెప్పలేకపోయినా ఇది తరతరాలుగా వస్తున్న ఆచారంగా వారు చెబుతారు.
గండ్రేటి కుటుంబీకులు కోట గండ్రేటి నుంచి, పల్లి కుటుంబీకులు పల్లె గండ్రేడ నుంచి ఈ ప్రాంతానికి వచ్చారు. ఊర్లు మారినా వంశాచారాన్ని వారు వీడలేదు. గండ్రేటి వారు, పల్లివారు బంధువులు. గండ్రేటి వారి బాటలోనే పల్లి కుటుంబీకులు కూడా నడుస్తున్నారు. మృతి చెందిన పెద్దలు, పిన్నలకు కనుమ రోజున నైవేద్యం పెడతారు. మరునాడు (కనుమ) పశువులకు నూనె, పసుపు రాసి స్నానం చేయించి పూజలు చేస్తారు. వాటికి పిండి వంటలు పెడతారు. మిగిలిన వైశ్య, తెలగ, సామాజిక వర్గాలు మాత్రం సంక్రాంతిని యధావిధిగా భోగి పండగ తర్వాత జరుపుకొంటాయి. పండగ మార్పు తమకు ఆనందంగా ఉందని.. ఈ ఆచారాన్ని పాటించే కుటుంబాల మహిళలు తెలిపారు. తమ పుట్టింట్లో భోగి, సంక్రాంతి, కనుమ చేసుకొని అత్తింటికి సంక్రాంతి పండగకు వస్తారు. వారు జరుపుకొనే కనుమ పండుగకు పరిసరాల గ్రామస్తులు వస్తారు.
సంక్రాంతి రోజు భోగి
నారాయణపురంలో ఆచారం
బలిజిపేట: నారాయణపురం దేవాంగుల వీధిలో సంక్రాంతి రోజు భోగి పండగ జరుపుకొంటారు. కొన్నేళ్ల క్రితం దేవాంగులకు చెందిన నేత మగ్గాలు, ఇతరత్రా సరుకులు నారాయణపురానికి చెందిన రైతులు భోగి మంటలో పడవేశారని.. ఆగ్రహించిన కూడా రైతుల నాగళ్లు, నాటుబళ్ల సామగ్రిని సంక్రాంతి రోజున భోగి మంటల్లో పడవేశారని స్థానికులు చెబుతున్నారు. అప్పటినుంచి నారాయణపురంలో మాత్రమే దేవాంగులు భోగి రోజు వేయాల్సిన మంటను సంక్రాంతి రోజు వేస్తుంటారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment