తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చిన్నారికి చోటు
ఏలూరు సిటీ : స్థానిక దక్షిణపు వీధిలోని ది ఇండో ఇంగ్లిష్ పాఠశాలలో నర్సరీ చదువుతున్న బేబీ జాగృతి త్రిశతాధిక చిత్రధారణలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించినట్టు పాఠశాల వ్యవస్థాపకుడు డాక్టర్ ఏవీఎ న్ రాజు శనివారం తెలిపారు. 20 అంశాలకు సంబంధించి సుమారు 300 పైగా చిత్రాలకు పేరు చెప్పగానే చిత్రాన్ని చూపిస్తూ రికారు సృష్టించినట్టు చెప్పారు. బేబీ జాగృతి గిన్నిస్ రికార్డ్ గ్రహీత డాక్టర్ నారాయణం శివశంకర్, సుగుణ దంపతుల కుమార్తె. జాతీయ, రాష్ట్ర చిహ్నాలు, తెలుగు కవులు, చారిత్రక ప్రదేశాలు, భారత ప్రధానులు, మంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు, ప్రముఖ క్రీడాకారులు, వాహనాలు, శరీర భాగాలు, పక్షులు, పండ్లు, కూరగాయలు, వృత్తులు, అడవి జంతువులు, ఇలా 20 అంశాలకు చెందిన చిత్రాలను చూపిస్తూ తన జ్ఞాపకశక్తిని ప్రదర్శించినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ నుంచి వచ్చిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్ సాయిశ్రీ, ఏలూరు డివిజ న్ సలహాదారు సుబ్బారావు పర్యవేక్షించారు. ముఖ్య అతిథులుగా ఆశ్రం అస్పత్రి రిటైర్డ్ ఆర్‌ఎంవో డాక్టర్ పి.బాపిరాజు, చిన్మయి మిష న్ పూర్వ చైతన్య మాతాజీ హాజరయ్యారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఈబీవీ ప్రసాద్, పాఠశాల కరస్పాండెంట్ సుభద్ర రాజు, వైస్ ప్రిన్సిపాల్ కల్యాణి ప్రసాద్ పాల్గొన్నారు.