‘అమ్మానాన్నలు మాకొద్దు’ | Children compliant to police thier parents not to study | Sakshi
Sakshi News home page

‘అమ్మానాన్నలు మాకొద్దు’

Published Wed, Jun 1 2016 11:03 PM | Last Updated on Mon, Sep 4 2017 1:25 AM

Children compliant to police thier parents not to study

హనుమాన్‌జంక్షన్ రూరల్(కృష్ణా): ‘బడికెళతామంటే వద్దు పనికి పొమ్మంటున్నారు.. మాకేమో చదువుకోవాలని ఉంది.. ఇంట్లో ఎప్పుడూ గొడవలు, తన్నులాటలే.. ఏంచేయాలో దిక్కుతోచటం లేదు.. మాకీ అమ్మనాన్నలు వద్దు..’  అంటూ ఇద్దరు చిన్నారులు కృష్ణా జిల్లా వీరవల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కథనం మేరకు.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని తంగెళ్లమూడికి చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ అక్రం కొన్నేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన శిరీషను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి కూతురు మహ్మద్ షన్ను (12), కుమారుడు మహ్మద్ అబ్దు బకత్ సిద్ధిఖ్ (9) ఉన్నారు. కొంతకాలంగా వీరి సంసారంలో గొడవలు ప్రారంభమయ్యాయి. పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అమ్మమ్మ, తాతయ్యలు వింజమూరి మల్లేశ్వరి, రంగారావు.. బాపులపాడు మండలంలోని ఎ.సీతారామపురంలో తమ వద్దే ఉంచుకుని చదువు చెప్పిస్తున్నారు.

పది రోజుల క్రితం అక్రం.. తమ పిల్లలను పంపించాలని గొడవ చేసి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి దంపతులు రోజూ గొడవపడడం, పిల్లలను వేధించడం, కూలి పనులకు వెళ్లాలని కొట్టడంతో భరించలేక అమ్మమ్మ, తాతయ్య దగ్గరకు వచ్చేశారు. తండ్రి మళ్లీ వచ్చి తీసుకెళతాడని భయపడిన వారు బుధవారం నేరుగా వీరవల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. తాము తమ తల్లిదండ్రుల వద్ద ఉండలేమంటూ కన్నీటి పర్యంతమవుతూ వారి కష్టాలు ఎస్‌ఐ పి.మురళీకృష్ణకు చెప్పుకున్నారు. తల్లిదండ్రులు తమను కొడుతున్నారని, బడికి పంపించడం లేదని వాపోయారు. అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటూ చదువుకుంటామని చెప్పారు. పోలీసులు పిల్లలిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి గన్నవరం ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement