మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) ప్రధాన అంగరక్షకురాలు మడ్డు పూర్ణిమ అలియాస్ శిరీష ఇటీవల ఒడిశాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు.
డిసెంబర్ 31న ఎన్‌కౌంటర్‌లో మృతి
కుటుంబ సభ్యులకు ఆలస్యంగా అందిన సమాచారం
వజ్రపుకొత్తూరు, న్యూస్‌లైన్: మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) ప్రధాన అంగరక్షకురాలు మడ్డు పూర్ణిమ అలియాస్ శిరీష ఇటీవల ఒడిశాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. ఈ సమాచారం ఆమె కుటుంబ సభ్యులకు ఆలస్యంగా సోమవారం అందింది. డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి ఒడిశాలోని కోరాపుట్ జిల్లా బీరిగూడ పరిసర ప్రాంతాల్లో జరిగిన పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆమె మృతి చెందినట్లు మల్కన్‌గిరి డివిజన్ మావోయిస్టు పార్టీ కమిటీ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.
శిరీష మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యునిగా పనిచేసి, ప్రభుత్వానికి లొంగిపోయిన మడ్డు బాబూరావు కుమార్తె. వీరి స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి. 2000లో పార్టీలో చేరిన ఆమె కొరాపుట్ ఏరియా కమిటీలో సభ్యురాలిగా పనిచేశారు. అనంతరంరామకృష్ణ భద్రత కోసం ఏర్పాటు చేసిన అంగరక్షక దళానికి నాయకురాలిగా వ్యవహరిస్తున్నారు. 1998 ఆగస్టులో జరిగిన కొప్పరడాంగ్ ఎన్‌కౌంటర్‌లో తల్లి కమల మృతి చెందడాన్ని జీర్ణించుకోలేక.. మావోయిస్టు పార్టీలో చేరాలని నిర్ణయించుకుంది. కుమార్తె మరణవార్త తనను కలచివేసిందని బాబూరావు తెలిపారు.