‘పున్నామ’ నరకం
– వ్యసనాలకు బానిసలుగా పుత్రులు
– డబ్బుల కోసం తల్లిదండ్రులకు నరకం
–––––––––––––––––––––––––––
తాడిపత్రి మండలం గన్నెవారిపల్లె కాలనీలో పెద్దయ్య(34) తన తండ్రి చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడు. తాగుడుకు పూర్తిగా బానిసైన పెద్దయ్య డబ్బుల కోసం తండ్రి చిన్నభూషణ్‌ను నిత్యం వేధించేవాడు. డబ్బులివ్వకపోతే చంపుతానని బెదిరించేవాడు. ఈ క్రమంలో తండ్రే కుమారున్ని హత్య చేయాల్సి వచ్చింది. ఈ సంఘటన గత నెల 15న జరిగింది.
అనంతపురం రూరల్ మండలం చంద్రబాబు కొట్టాల సమీపంలోని గౌరవ్‌హోమ్స్‌లో సత్యేంద్ర(33)ను తండ్రే కొట్టి చంపారు. ఎంబీబీఎస్ చదివిన సత్యేంద్ర విచక్షణ కోల్పోయి వ్యవహరించేవాడు. ఆస్తిలో భాగం పంచివ్వాలని తండ్రిని బెదిరించేవాడు. ఎక్కడ హతమారుస్తాడోనని తండ్రి గిరియప్పే హతమార్చాడని పోలీసుల ప్రాథమిక నిర్ధరణలో వెల్లడైంది. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. జిల్లాలో నెల రోజుల వ్యవధిలోనే ఒకే తరహా ఘటనలు వరుసగా జరగడం సంచలనం సష్టించింది.
––––––––––––––––––––––––––––––––––––––––––––––
అనంతపురం సెంట్రల్ : పున్నామ నరకం నుంచి కాపాడే వాడు పుత్రుడు అన్నది నానుడి. తండ్రి చనిపోయిన తర్వాత పిండం పెడితే నరకానికి కాకుండా స్వర్గానికి పోతారని నమ్ముతారు. చనిపోయిన తర్వాత స్వర్గం ఉందో లేదో గానీ బతికుండగానే తల్లిదండ్రులకు పున్నామి నరకం చూపిస్తున్నారు కొందరు సుపుత్రులు. మలిసంధ్యలోని అమ్మానాన్నలకు అండగా నిలవాల్సిందిపోయి వారి పాలిట యమకింకరులగా తయారయ్యారు. ‘ఇస్తావా.. చస్తావా’ అంటూ బెదిరిస్తున్నారు. తమ మాటను కాదంటే విచక్షణారహితంగా కొడుతూ, తిడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఏం చేయాలో దిక్కుతోచక తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు.
వ్యసనాలకు బానిసలై కొందరు..
ఎక్కువశాతం యువకులు జూదం, తాగుడు, వ్యభిచారానికి బానిసలవుతున్నారు. తాగేందుకు డబ్బులివ్వకపోతే ఎంతకైనా తెగిస్తున్నారు. డబ్బులిస్తావా? చస్తావా అంటూ హెచ్చరిస్తున్నారు. లేకుంటే నాకొచ్చే ఆస్తి నాకు ఇచ్చేయ్.. అంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఉన్న ఆస్తి పాస్తులు వారి చేతిలో పెడితే ఎక్కడ చేయి జార విడస్తారో అని తల్లిదండ్రులు మదనపడుతున్నారు. ఇలాంటి తరహా ఘటనలు ఇటీవల కాలంలో అధికమవుతున్నాయి. పోలీస్‌స్టేషన్లకు వచ్చే కేసుల్లో అధిక శాతం ఇలాంటి కేసులే ఉంటున్నాయి. స్టేషన్లకు రాకనే కొందరు తమ తల్లిదండ్రులను ఇళ్ల నుంచి వెళ్లగొడుతున్నారు. మరికొందరు దైర్యం చేసి వారిని వారించే ప్రయత్నంలో కుమారుల చేతిలో దెబ్బలు తిని గాయాలపాలవుతున్నారు.
జల్సాల కోసం మరికొందరు..
మరికొందరు యువకులు జల్సాలకు అలవాటు పడుతున్నారు. కోరిన బైకు.. అడిగినంత డబ్బు ఇవ్వాల్సిందేనని అమ్మానాన్నలపై ఒత్తిడి తెస్తున్నారు. లేకుంటే వారితో గొడవలకు దిగడం, ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. ఇటీవల అనంతపురంలోని సిండికేట్‌నగర్ వద్ద బైక్, ఆటో ఢీకొన్న సంఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. అందులో ఓ యువకుడు కొత్తగా యమహా ఎఫ్‌జెడ్ బైక్ కొనుగోలు చేశాడు. స్నేహితులకు డిన్నర్ ఇచ్చిన అనంతరం వారిని డ్రాప్ చేసి అతివేగంతో వస్తూ ఆటోను ఢీ కొన్నారు. ఈ ఘటనలో ఏ పాపం ఎరుగని ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా మత్యువుతో రోజంతా పోరాడి చనిపోయాడు. కొద్దిరోజుల క్రితం మరో యువకుడు స్నేహితులతో కలసి ఇతర రాష్ట్రాలకు విహార యాత్రకు వెళ్లి ప్రమాదవశాత్తు నీళ్లలో పడి మత్యువాత పడ్డాడు. ఇలా పిల్లలకు డబ్బులిస్తే ఓ ప్రమాదం, ఇవ్వకపోతే మరో ప్రమాదం తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ క్రమంలో చావడమా? చంపడామా అనే స్థాయికి కొందరు తల్లిదండ్రులు వెళ్తున్నారు.
–––––––––––––––––––––––––––––––––––––––
పెంపకంపైనే ఆధారపడి ఉంటుంది
ఇటీవల ఎక్కువ మంది యువత చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. పెంపకమే వారిని అలా తీయారు చేస్తోంది. చిన్న వయస్సు నుంచి పిల్లల్లో మంచి లక్షణాలు అలవర్చుకునేలా తయారు చేయాలి. తల్లిదండ్రులు మంచిగా ఉంటే వారి నుంచి కూడా పిల్లలు నేర్చుకుంటారు. పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులు కూడా మంచి లక్షణాలు నేర్పించడం ఒక సబ్జెక్టులా ఎంచుకోవాలి. టెన్షన్ తగ్గించుకోవడానికి యోగా అలవాటు చేయించాలి. దీని వలన యుక్త వయస్సులో చెడుమార్గాలకు వెⶠ్లకుండా ఉంటారు.
– డాక్టర్ ఆదిశేషయ్య, ప్రభుత్వ పోలీసు ఆస్పత్రి వైద్యుడు
––––––––––––––––––––––––––––––––––––––