వారి గొడవలు సీఎంకు ముందే తెలుసా..? | chittoor mayor katari anuradha, katari mohan murder case | Sakshi
Sakshi News home page

వారి గొడవలు సీఎంకు ముందే తెలుసా..?

Published Wed, Nov 25 2015 10:58 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

వారి గొడవలు సీఎంకు ముందే తెలుసా..? - Sakshi

వారి గొడవలు సీఎంకు ముందే తెలుసా..?

  • చింటూ, మోహన్ మధ్య చిచ్చు పెట్టింది సీఎం సామాజిక వర్గం నేతలే
  • పరిస్థితులు ఇలానే ఉంటే భవిష్యత్తులో తమకు పదవులు రావనే భయం
  • అందుకే ఇరువర్గాలను ఎగదోశారు
  • ప్రతిఫలంగా కఠారి దంపతుల హత్య
  •  
    సాక్షి, చిత్తూరు: ‘చింటూ, కఠారి మోహన్ మధ్య గొడవ తన దృష్టికి వచ్చి ఉంటే సమస్యను పరిష్కరించి ఇంతదూరం రాకుండా చేసే వాడిని’ కఠారి దంపతుల హత్య అనంతరం చిత్తూరుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరుల సమావేశంలో చెప్పిన మాటలివి. వాస్తవానికి చింటూ, కఠారి కుటుంబాల మధ్య తీవ్రస్థాయికి చేరిన వివాదాన్ని అటు కఠారి, ఇటు చింటూతోపాటు పలువురు దేశం నేతలు మూడు నాలుగు నెలల క్రితమే సీఎం దృష్టికి తెచ్చారు. మోహన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను పట్టించుకోవడం లేదంటూ చింటూ ముఖ్యమంత్రితో పాటు, లోకేష్‌కు సైతం ఫిర్యాదు చేశాడు. చింటూ చీటికిమాటికి చిల్లర గొడవలకు దిగుతూ పార్టీకి సైతం ఇబ్బందులు సృష్టిస్తున్నాడని మోహన్ చెప్పినట్లు సమాచారం.
     
    పార్టీలోని కొందరు నేతలు చింటూను ప్రోత్సహిస్తూ వర్గ విభేదాలు సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇటు చింటూ, అటు కఠారి మోహన్ మధ్య గొడవలు తీవ్రరూపం దాలుస్తున్నాయని, ఇరువర్గాలను సర్దుబాటు చేయకపోతే చిత్తూరులో టీడీపీకి నష్టం వాటిల్లుతుందని చిత్తూరుకు చెందిన పలువురు నేతలు సైతం ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. కఠారి, చింటూల మధ్య గొడవలు మరింత పెరిగితేనే తాము మనగలమని భావించారు ఒక సామాజికవర్గం నాయకులు. అందుకే వాటి తీవ్రత తగ్గించి సీఎం దృష్టికి తీసుకువెళ్లేవారు. దీంతో సీఎం పట్టించుకోకుండా వదిలేశారు. హత్య అనంతరం చిత్తూరుకు వచ్చి వీరి గొడవలు తన దృష్టికి రాలేదని, వచ్చి ఉంటే పరిస్థితి ఇంతదూరం రానివ్వనంటూ సీఎం పేర్కొనడం విడ్డూరం. 
     
    చిచ్చుపెట్టింది సీఎం సామాజిక వర్గ నేతలే
    కఠారి మోహన్, చింటూ మధ్య చిచ్చుపెట్టింది సీఎం సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలేనని టీడీపీలో ప్రచారం జోరుగా సాగుతోంది. చిత్తూరులో ఒక సామాజిక వర్గం ఆధిపత్యం రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే డీకే.ఆదికేశవులనాయుడు సతీమణి సత్యప్రభ చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు అదే సామాజిక వర్గానికి చెందిన కఠారి మోహన్ కుటుంబానికి కీలకమైన మేయర్ పదవిని కట్టబెట్టారు. దీంతో ఆ సామాజిక వర్గం చిత్తూరులో బలం పుంజు కుంది. మరోవైపు కఠారి మోహన్ ఎమ్మెల్యే టికెట్ తనకే ఇవ్వాలంటూ గత ఎన్నికల్లోనే  పట్టుబట్టిన విషయం తెలిసిందే. దీన్ని ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన కొందరు కీలక నేతలు జీర్ణించుకోలేకపోయారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తమకు ఏ పదవీ దక్కే అవకాశం లేదని భావించారు. ఇందులో భాగంగానే చింటూ, కఠారి మధ్య వివాదాలు సృష్టించి దానికి మరింత ఆజ్యం పోశారు. వాటి ఫలితమే కఠారి దంపతుల దారుణ హత్య. రెండు కుటుంబాల మధ్య తగవులు పెట్టి దారుణానికి ఒడిగట్టింది టీడీపీ నాయకులేనని చింటూ తండ్రి సుబ్రమణ్యంనాయుడు సాక్షితో వాపోయారు.
     
    పోలీసులకు లొంగిపోయిన మురుగ
    చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో నగరంలోని సంతపేటకు చెందిన మురుగ మంగళవారం పోలీసులకు లొంగిపోయాడు.  కేసులో మురుగను సైతం పోలీసులు నిందితుడిగా చేర్చారు. హత్య జరిగిన రోజు నుంచి అజ్ఞాతంలో ఉన్న ఇతడు మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో చిత్తూరులోని టూటౌన్ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు.  
     
    చింటూ పెద్దనాన్న గుర్రప్పపై విచారణ
    చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో పోలీసులు అన్ని వైపుల నుంచి విచారణ చేపడుతున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ పెద్దనాన్న గుర్రప్పను మంగళవారం విచారించారు.  మోహన్ పెద్దక్క యశోదమ్మ భర్తే గుర్రప్ప. 2005లో జరిగిన ఎన్నికల్లో యశోదమ్మ తన తమ్ముడు కఠారి మోహన్‌పై వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓడిపోయింది.
     
    అప్పటి నుంచి కఠారి, గుర్రప్ప కుటుంబాల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో గుర్రప్పకు చింటూ కుటుంబానికి మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. చింటూకు ఆర్థిక అవసరాలు రాగా గుర్రప్ప ఓ వ్యక్తి నుంచి పెద్ద మొత్తంలో అప్పు చేసి ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే ఈ మొత్తాన్ని దేనికి, ఎందుకు ఉపయోగించాడనే విషయాలు తనకు తెలియదని గుర్రప్ప పోలీసులకు చెప్పినట్లు సమాచారం. గుర్రప్ప చెప్పిన వివరాల ఆధారంగా పలువురు రాజకీయ నాయకులను విచారించడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇందులో అధికారపార్టీ నేతలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు.  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement