క్రైస్తవులపై దాడులు అరికట్టాలి
క్రైస్తవులపై దాడులు అరికట్టాలి
Published Mon, Feb 6 2017 10:46 PM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM
క్రైస్తవ సంఘాల డిమాండ్
కలెక్టర్ వద్ద ధర్నా, శాంతి ర్యాలీ
కాకినాడ సిటీ : క్రైస్తవులపై రోజురోజుకు పెరుగుతున్న దాడులపై వివిధ క్రైస్తవ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. క్రైస్తవులపై దాడుల్ని తక్షణం అరికట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఫ్లకార్డులతో దాడులపై నిరసన తెలిపారు. నాయకులు మాట్లాడుతూ అధికమవుతున్న మతోన్మాద ధోరణుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా దేశానికి చెడ్డ పేరువస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన అనంతరం కలెక్టరేట్ నుంచి ఇంద్రపాలెం వంతెన వరకూ ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు అద్దంకి రంజిత్ ఓఫీర్, క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ డైరెక్టర్ మూర్తిరాజు, రక్షణ టీవీ సీఎండీ జక్కుల బెన్‌హర్, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ నాయకులు కాశి బాలయ్య, రాజ భూషణం, జార్జి ముల్లర్, కిరణ్‌పాల్ పాల్గొన్నారు
క్రైస్తవుల శాంతి ర్యాలీ
క్రైస్తవులపై దాడులను ఖండిస్తూ ఆలిండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నగరంలో సోమవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. భానుగుడి సెంటర్ నుంచి మెయిన్‌రోడ్డు, బాలాజీ చెరువు సెంటర్, జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకూ ర్యాలీ జరిపారు. కౌన్సిల్ నాయకుడు బి.రాజేంద్రబాబు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన వాక్ స్వేచ్ఛను సైతం దిక్కరిస్తూ మతోన్మాదంతో క్రైస్తవులపై దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన చెందారు. చర్చిలను ధ్వంసం చేయడమే కాకుండా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మత ఛాందస వాదులను చట్టపరంగా శిక్షించాలని, క్రైస్తవులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement