అర్ధరాత్రి సీఐడీ సీఐ వీరంగం
విజయవాడ: ఓ పక్క ప్రభుత్వాలు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ఊదర కొడుతున్న కొందరు అధికారుల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. ప్రజలకు సేవ చేయాల్సిన ఓ ఉన్నతాధికారే అడ్రస్ అడిగితే చెప్పలేదనే కోపంతో ఓ పౌరుడిపై విరుచుకుపడిన సంఘటన విజయవాడలో శనివారం అర్ధరాత్రి వెలుగుచూసింది.
వివరాలు.. ఏలూరు రోడ్డులోని రామమందిరం వద్ద నిల్చొని ఉన్న భాను అనే యువకుడిని మఫ్టీలో ఉన్న సీఐడీ సీఐ రామచంద్రరావు ఓ అడ్రస్ అడిగాడు. దీనికి ఆ యువకుడు తనకు అడ్రస్ తెలియదని కావాల్సి వస్తే.. గూగుల్ మ్యాప్‌లో చూసుకోవాలని ఓ ఉచిత సలహా ఇచ్చాడు. దీంతో సదరు సీఐ గారికి చిర్రెత్తుకొచ్చింది. నాకే సలహా ఇస్తావా అంటూ అతని పై ముష్టిఘాతాలు కురిపించాడు. పోలీస్ జులుం చూపిస్తూ.. జీపులో వేసి చితకబాదాడు. ఇది గుర్తించిన స్థానికులు యువ కుడిని రక్షించేందుకు ప్రయత్నించగా.. అప్రమత్తమైన సీఐ స్థానిక సూర్యారావుపేట పోలీసులను పిలిపించుకొని వారి రక్షణలో అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నాడు. అంతటితో ఆగకుండా.. తన్నులు తిన్న యువకుడిని కూడా స్టేషన్‌కు తీసుకెళ్లి తనదైన స్టైల్లో బెదిరించి మీడియా కంట పడకుండా పంపేశాడు.