
జీతాలపై స్పష్టత కరువు
దేవాలయాల్లో పనిచేసే అర్చకుల్లో ఆందోళన తగ్గలేదు. వారి జీతాలను రూ. 10 వేల నుంచి సగానికి తగ్గించే ...
కడప కల్చరల్ : దేవాలయాల్లో పనిచేసే అర్చకుల్లో ఆందోళన తగ్గలేదు. వారి జీతాలను రూ. 10 వేల నుంచి సగానికి తగ్గించే ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వ అధికారులు ఇప్పటివరకు ఆ విషయం పట్ల ఎలాంటి ప్రకటన చేయకపోవడమే దీనికి కారణం. రూ. 10 వేలు తీసుకుంటున్న అర్చకులకు సగం తగ్గించి కేవలం రూ. 5 వేలే ఇచ్చేందుకు దేవాదాయశాఖ అధికారులు సిద్ధమవుతున్నట్లు సాక్షి బుధవారం ఆధారాలతోసహా బయటపెట్టింది. ఈ విషయంపై రాష్ట్రంలోని అర్చకులంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పలువురు అర్చకులు నేరుగా ఆ శాఖ కమిషనర్‌కే ఈ విషయంగా స్పష్టత కోరుతూ ఫోన్లు చేశారు...మెసెజ్‌లు పెట్టారు. దీంతో స్పందించిన ఉన్నతా«ధికారి ఒకరు వారందరికీ తిరిగి మెసెజ్‌లు పెట్టారు.
గ్రామీణ ప్రాంతాల అర్చకులు, కొత్తగా చేరే అర్చకులకు మాత్రమే రూ. 5 వేలు ఇస్తామని, మిగతా వారిలో రూ. 10 వేలు జీతం తీసుకుంటున్న వారికి ఏమాత్రం తగ్గించబోమని మెసెజ్‌లో పేర్కొన్నారు. దీంతో అర్చకుల్లో కొద్దిగా ఆందోళన తగ్గినా ఇలా వ్యక్తిగతంగా కాకుండా నేరుగా ప్రసార మాధ్యమాల ద్వారానే ఈ విషయం ప్రముఖంగా ప్రకటిస్తారని ఎదురు చూశారు. ఆ శాఖగానీ, ముఖ్యమంత్రిగానీ ఈ విషయంగా స్పందించకపోవడంతో అర్చకుల్లో తిరిగి ఆందోళన మొదలైంది.
శాపగ్రస్తులా..?
గ్రామీణ అర్చకులు దేవాలయ భూములను సాగు చేసుకుంటున్నారు అందువల్ల వారికి ఇస్తున్న రూ.10 వేల జీతాన్ని రూ.5 వేలకు తగ్గిస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. నిజానికి ఆ భూములు పేరుకు మాత్రమే అర్చకులవి. చాలా భూములు సాగుకు పనికి రాని స్థితిలో ఉన్నాయి. అర్చకుడు వాటిని పెట్టుబడి పెట్టి సాగు చేసుకునే స్థితిలో లేడు. మరికొన్నిచోట్ల భూములు ఆ ప్రాంత పెద్దల చేతిలో ఉన్నాయన్నది అందరికీ తెలిసిన సత్యం. వారు అర్చకులకు విదిలింపుగా మాత్రమే కౌలు ఇస్తున్నారు. ఇలాంటి దశలో గ్రామీణ అర్చకులు కేవలం రూ.10వేల జీతంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలోని 1,886 దేవాలయాల్లో కేవలం 100 మంది అర్చకులకు మాత్రమే రూ.10 వేల జీతం అందుతోంది.
మిగతా వారు ముఖ్యంగా గ్రామీణ అర్చకులు హారతి పల్లెంలో భక్తులు సమర్పించే కానుకలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. సీజన్‌లో మినహా మిగతా రోజుల్లో రోజుకు పల్లెం ద్వారా రూ. 20 కూడా లభించదన్నది పచ్చినిజం. ఈ దశలో అరకొర మందికి ఇస్తున్న రూ. 10 వేలు జీతంలో కోత పెట్టడం పట్ల అర్చకులు ఖిన్నులవుతున్నారు. ఈ విషయంగా నిరసన తెలిపేందుకు అర్చక సంఘాల్లో కొందరు ప్రయత్నించినా ఏదో కారణంతో ఉన్న ఉద్యోగాన్ని కూడా పీకేస్తారేమోనన్నభయంతో వారు మిన్నకుండిపోతున్నారు.
అధికారుల స్పందన ఏదీ?
అర్చకుల్లో ఆందోళన పోగొట్టేందుకు దేవాదాయశా ఖ అధికారులుగానీ, ఆ శాఖ మంత్రిగానీ, ముఖ్య మంత్రిగానీ స్పందించలేదు. ఆ శాఖ మంత్రి మాణిక్యాలరావు అర్చకులను కనీసం సముదాయించేందుకు కూడా ప్రయత్నించలేదు. రాష్ట్ర బ్రాహ్మణ ఫెడరేషన్ యువజన విభాగం అధ్యక్షులు ద్రోణంరాజు రవికుమార్ మాత్రం ఈ విషయంగా ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. బ్రాహ్మణ ఫెడరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వ తీరును తీవ్రం గా విమర్శించారు. అర్చకులకు కనీసం రూ.20 వేల జీతం ఇవ్వడం న్యాయమని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోవడంతో అర్చకుల్లో అనుమానాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ వార్త అబద్ధమైతే వారెందుకు ఖండించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా ఆలస్యం చేయకుండా ఈ విషయంగా తమలో నెలకొన్న ఆందోళనను తగ్గించేదుకైనా దేవాదాయశాఖ మంత్రిగానీ, అ«ధికారులుగానీ స్పష్టత ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు.