11న సీఎం రాక? | CM arrival On July 11th in Nalgonda district! | Sakshi
Sakshi News home page

11న సీఎం రాక?

Published Sat, Jun 25 2016 3:24 AM | Last Updated on Mon, Aug 13 2018 4:03 PM

11న సీఎం రాక? - Sakshi

11న సీఎం రాక?

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి జిల్లాకు రానున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 11వ తేదీన జాతీయ రహదారి (ఎన్‌హెచ్)  65పై నిర్వహించనున్న హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నట్లు సమాచారం. హరితహారంలో భాగంగా ఎన్‌హెచ్-65కి ఇరువైపులా మూడు వరుసల్లో చెట్లు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారని, చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట నుంచి 25 కిలోమీటర్ల వరకు ఎక్కడైనా ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు తెలిసింది.

సీఎం టూర్ కచ్చితంగా ఖరారు కాకపోయినా.. జాతీయ రహదారి వెంట చెట్లు నాటించాలనేది ఆయన అభీష్టమేని..  కచ్చితంగా ఈ కార్యక్రమానికి హాజరవుతారని  అధికార వర్గాలంటున్నాయి. ఈ మేరకు వారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
 
ఏంటి... ఇంత బోసిగా ఉంది..
సీఎం కేసీఆర్ వాస్తవానికి జాతీయ రహదారికి ఇరువైపులా చెట్లు నాటే కార్యక్రమం చేపట్టాలని ఈ ఏడాది ఏప్రిల్‌లోనే నిర్ణయించారు. ఏప్రిల్ 26న ఖమ్మంలో జరిగిన పార్టీ ప్లీనరీకి ఆయన రోడ్డు మార్గంలో సూర్యాపేట నుంచి వెళ్లారు. అప్పుడు జాతీయ రహదారికి ఇరువైపులా చెట్లు లేవని, బోసిపోయి ఉందనే విషయాన్ని గమనించారు.

వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడిన సీఎం తెల్లారి ఏప్రిల్ 27న తన ఓఎస్డీ, ఐఎఫ్‌ఎస్ అధికారిణి ప్రియాంకా వర్గీస్‌ను జిల్లాకు పంపారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్. సత్యనారాయణతోపాటు భారత ప్రభుత్వ, అటవీ, ఆర్‌అండ్‌బీ, డ్వామా అధికారులతో ఆమె పంతంగిలో సమావేశమై జాతీయ రహదారికి ఇరువైపులా చెట్లు నాటించే కార్యక్రమంపై చర్చించారు. ఎన్‌హెచ్-65 మన జిల్లాలో ప్రారంభమయ్యే తూప్రాన్‌పేట నుంచి కోదాడ దాటేంత వరకు 160 కిలోమీటర్లు ఉంటుందని, ఆ పొడవునా..

ఇరువైపులా చెట్లు నాటించే కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం ఆదేశించినట్లు జిల్లా అధికారులకు ఆమె వివరించారు. జూలై రెండో వారంలో వర్షాలు కురిసిన తర్వాత ప్రారంభమయ్యే హరితహారాన్ని నల్లగొండ జిల్లా నుంచి ప్రారంభిస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు కూడా వెల్లడించారు. ఈ మేరకు సంబంధిత కార్యాచరణను కేంద్ర ప్రభుత్వానికి, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)కి పంపించా రు.

అయితే.. ఈ ప్రతిపాదనను కేంద్రం పెద్దగా పట్టించుకోనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే సీఎం చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిం చేందుకు సిద్ధమైంది కానీ, 2020లో ఎన్‌హెచ్-65ని మళ్లీ డబ్లింగ్ చేయాల్సి ఉం టుందని, ఇప్పుడు చెట్లు నాటితే అప్పుడు తీసివేయాల్సి ఉంటుందని ఎన్‌హెచ్‌ఐఏ అధికారులు మెలిక పెట్టారు.
 
దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై
 వారం, పది రోజుల క్రితం ఎన్‌హెచ్‌ఏఐకి చెందిన సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి, అటవీ శాఖ రిటైర్డ్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ అయిన ఓ  ఉన్నతాధికారి హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై గ్రీనరీ కార్యక్రమాన్ని చేపట్టిందని, తెలంగాణలో ఉన్న జాతీయ రహదారులపై ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారో చెప్పాలని ఆయన కోరారు. ఈ క్రమంలో అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న ఆలోచనను  రాష్ట్ర అధికారులు..

ఆయన ముందుంచారు. స్పందించిన ఆ అధికారి తాము ఇప్పటికిప్పుడు కేంద్రం నుంచి నిధులివ్వలేమని, కార్యక్రమాన్ని రాష్ట్రం చేసుకోవచ్చనివెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్-65కి ఇరువైపులా చెట్లు నాటించే కార్యక్రమం, సీఎంతో ప్రారంభించే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మ హారాష్ట్రలోని పుణేలో 28 లక్షల చెట్లను ఒకేసారి నాటారు. ఈ సారి హరితహా రంలో భా గంగా  హైదరాబాద్ నగరంలో 25లక్షల మొక్కలను నాటించాలని రా ష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రాక ఖరారైతే జి ల్లాలో కనీసం 10 లక్షల మొక్కలను నాటించాలని అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.
 
కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
జిల్లాలో చేపట్టనున్న హరితహారం కార్యక్రమంపై ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, హైస్కూళ్లు, ఇంజనీరింగ్ కళాశాలలకు శుక్రవారం అవగాహన సద స్సు నిర్వహించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి విద్యాసంస్థ వచ్చే నెల 11న వంద మొక్కల చొప్పు న నాటాలని.. జిల్లాలో అటవీ విస్తీర్ణం పెరిగేందుకు కృషి చేయాలని సూచించారు.

పండుగ వాతావరణంలో జిల్లాలోని ప్రజలందరూ మనిషికో మొక్క నాటాలని ఆ యన పిలుపునిచ్చారు. జేసీ సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలోని రైస్‌మిల్లులు కూడా భారీ స్థాయిలో మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని సూ చించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి  అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement