
వారం రోజుల్లో మరోమారు సీఎం రాక
- వెల్లడించిన కలెక్టర్ కిషన్
- అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేయూలని అధికారులకు ఆదేశం
హన్మకొండఅర్బన్ : ముఖ్యమంత్రి కేసీఆ ర్ మరో వారం రోజు ల్లో జిల్లాకు వచ్చే అవకాశం ఉన్నం దున అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ కిషన్ ఆదేశించారు. ముఖ్యమంత్రి రానున్న సమాచారం నేపథ్యంలో బుధవారం రాత్రి కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో కలెక్టర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కిషన్ మాట్లాడుతూ రోడ్డు, భవనాలు, రక్షిత మంచినీరు, పరిశ్రమలస్థాపన, కుటుంబ సర్వే, ఆధార్, రేషన్‌కార్డులు, కల్యాణలక్ష్మి, వ్యవసాయం, వైద్య ఆరోగ్యం, మన ఊరు- మన ప్రణాళిక అంశాలపై పూర్తి వివరాలతో కూడిన నివేదిక లను జిల్లా ముఖ్య ప్రణాళికాధికారికి అందజేయాలని సూచించారు. అలాగే శాఖల వారిగా కొత్త పనులకు ప్రతిపాదనలు రూపొందించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఏజేసీ కృష్ణారెడ్డి, సీపీఓ బీఆర్‌రావు, వరంగల్ ఆర్డీఓ వెంకటమాధవరావు డీఆర్‌డీఏ పీడీ శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.