
'ఏపీని పక్కకు పెట్టి.. రాజకీయాలకు పెద్దపీట'
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాజకీయాలే ముఖ్యమై పోయాయని, అసలు కేంద్ర ప్రభుత్వాన్ని ఏమాత్రం ప్రశ్నించే పరిస్థితి కనిపించడం లేదని పలువురు మండిపడుతున్నారు.
విజయవాడ: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాజకీయాలే ముఖ్యమై పోయాయని, అసలు కేంద్ర ప్రభుత్వాన్ని ఏమాత్రం ప్రశ్నించే పరిస్థితి కనిపించడం లేదని పలువురు మండిపడుతున్నారు. ఆదివారం జరిగిన సమావేశంలో కూడా అసెంబ్లీ సీట్ల పెంపుపైనే ప్రధానంగా చర్చజరిగినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల పెంపుపై ఆయన రేపు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు తెలిసింది.
అయితే, రైల్వే జోన్ ప్రకటించకపోయినా కనీసం ఉత్తరం ద్వారానైనా ఆయన కేంద్రానికి నిరసన తెలపలేదు. అదీకాకుండా, విభజనలో ఏపీకి రావాల్సిన హక్కులపై పోరాటానికి కూడా ఆయన పార్టీ సిద్ధపడలేదు. రెవెన్యూ లోటు భర్తీ చేయకపోయినా, ప్రత్యేక హోదాను ఇవ్వకపోయినా, పోలవరం నిధులు ఇవ్వకపోయినా కనీసం నిరసన కూడా తెలపలేదు. కానీ, తాజాగా ఎమ్మెల్యే సీట్ల పెంపుకోసం రేపు లేఖ రాస్తుండటం పలువురు విమర్శలకు తావిస్తోంది. ఉత్తరాంధ్ర, సీమకు ప్యాకేజీ, పన్నుల్లో రాయితీలను ఇవ్వకపోయినా పట్టించుకోని చంద్రబాబు.. రాష్ట్ర ప్రయోజనాలు పక్కకుపెట్టి రాజకీయ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తుండటం రాష్ట్ర ప్రజలకు ఆయన తీరుపై అసహనం తెప్పిస్తోంది.