యువతను మోసం చేస్తున్న చంద్రబాబు
ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శులు
నెల్లూరు(బారకాసు): విద్యార్థులు, యువతను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసం చేస్తున్నారని ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శులు మధు, గోపాల్ ఆరోపించారు. ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని రేబాల లక్ష్మినరసారెడ్డి స్మారక భవనంలో విద్యార్థి, యువజన సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మెడలు వంచి అయినా సరే విద్యార్థి, యువకులకు ఇచ్చిన హామీలను సాధించుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అందుకు రాజకీయాలకు అతీతంగా విద్యార్థి, యువజన సంఘాలు ఒకే వేదికపై వచ్చి పోరాడాలన్నారు.
రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టీడీపీ కలుపుకునే విషయంలో శ్రద్ధ చూపుతున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించడం లేదన్నారు. విద్యార్థులు, యువకుల అభివృద్ధి అవసరం లేదనే విధంగా పరిపాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా చంద్రబాబు తన పద్ధతి మార్చుకోకుంటే చరిత్ర పురనావృతమవుతుందని హెచ్చరించారు. వైఎస్సార్‌ఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు జయవర్ధన్, శ్రావణ్ మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా మోసం చేస్తున్నారన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి శ్రీను మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ యూనివర్సిటీలలో అధ్యాపకుల పోస్టులు భర్తి చేయకుండా నిరుద్యోగాన్ని సీఎం పెంచి పోషిస్తున్నారన్నారు.
బీసీఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ అధ్యక్షులు సునీల్, మురళీ మాట్లాడుతూ రాష్ట్రంలో హాస్టల్స్‌ను ఎత్తివేసే బాధ్యత సీఎం చంద్రబాబు మంత్రులకు అప్పగించారన్నారు. పీపుల్స్‌ఫ్రంట్, ఎస్డీపీఐ అధ్యక్షులు కౌషిక్, ఘని, ఏపీ విద్యార్థి జేఏసీ కన్వీనర్ అంజయ్య మాట్లాడుతూ విద్యార్థి యువజన సంఘాల ఐక్య ఉద్యమాల ద్వారానే సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలన్నారు. ఏఎస్‌ఐఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్డీ సిరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైఎస్సార్‌యూ విభాగం నగర అధ్యక్షుడు వినోద్, వైఎస్సార్‌ఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్, శేషు, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సునీల్ పాల్గొన్నారు.