ఆరు నెలల్లో వారసత్వ ఉద్యోగం | CM KCR Green Signal For Singareni Dependent Jobs | Sakshi
Sakshi News home page

ఆరు నెలల్లో వారసత్వ ఉద్యోగం

Published Fri, Jan 6 2017 3:06 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

ఆరు నెలల్లో వారసత్వ ఉద్యోగం - Sakshi

ఆరు నెలల్లో వారసత్వ ఉద్యోగం

సింగరేణిపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌
వీఆర్‌ఎస్‌ తీసుకున్నా డబ్బులు తీసుకోని వారికి అవకాశం
1998కు ముందు దరఖాస్తు చేసుకున్న వారికీ వర్తింపు
కొత్తగా 20 ఓపెన్‌కాస్టులు, 12 భూగర్భ గనులు చేపడుతున్నట్లు వెల్లడి


సాక్షి, హైదరాబాద్‌: ‘‘ఎన్నికల హామీకి కట్టుబడి సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పునరు ద్ధరించాం. జనవరి 1 నుంచి దర ఖాస్తులు స్వీకరిస్తున్నాం. పదవీ విరమణ చేసే కార్మికుడి ఉద్యోగాన్ని ఖాళీగా ఉంచడం సబబు కాదు. దరఖాస్తు చేసుకున్న ఆరు నెలల్లో వారసత్వ ఉద్యోగాన్ని ఇస్తాం..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం శాసనసభలో ప్రకటించారు. వారసత్వ ఉద్యోగార్థుల గరిష్ట వయోపరిమితి 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతామన్నారు. 1998కి ముందు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి డబ్బులు తీసుకోకుండా.. వారసత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఉద్యోగా వకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

సింగరేణి బొగ్గు గనుల సంస్థపై గురువారం శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ప్రమాదంలో చనిపోయిన సింగరేణి కార్మికుల కుటుంబాలకు రూ.36 లక్షలు పరిహారం ఇస్తున్నామని, పదిహేను రోజుల్లో వారసులకు ఉద్యోగమిస్తున్నామని తెలిపారు. ఉద్యోగం కాదంటే మరో రూ.12 లక్షలు కలిపి రూ.48 లక్షల పరిహారం చెల్లిస్తున్నామన్నారు. అదే సహజ మరణమైతే రూ.26 లక్షల పరిహారం, వారసులకు ఉద్యోగం.. లేదంటే రూ.38 లక్షలు ఇస్తున్నామని తెలిపారు.

భూగర్భ గనులను కొనసాగిస్తాం
సింగరేణిలోని మొత్తం 46 గనుల్లో 30 భూగర్భ, 16 ఓపెన్‌ కాస్ట్‌ గనులు ఉన్నాయని... మొత్తం 56,866 మంది కార్మికులు పని చేస్తున్నారని సీఎం కేసీఆర్‌ తెలిపారు. భూగర్భ గనుల్లో 34,764 మంది, ఓపెన్‌ కాస్టుల్లో 10,427 మంది కార్మికులు పనిచేస్తున్నా రన్నారు. 2015–16లో భూగర్భ గనులతో రూ.1,869 కోట్ల నష్టం రాగా.. ఓపెన్‌ కాస్టుల తో రూ.3,998 కోట్లు లాభం వచ్చిందని తెలి పారు. గత ఆరేళ్లలో భూగర్భ గనులతో రూ .8,118 కోట్ల నష్టంరాగా.. ఓపెన్‌ కాస్టులతో రూ.12,469 కోట్ల లాభం వచ్చిందన్నారు. అయితే భూగర్భ గనుల ద్వారా వస్తున్న నష్టాన్ని ఓపెన్‌ కాస్టుల ద్వారా వస్తున్న లాభాలతో పూడుస్తున్నామని చెప్పారు.

కొత్తగా ఓపెన్‌ కాస్టులు
ఓపెన్‌ కాస్టు గనులు లేకుండా సింగరేణి మనుగడ సాధ్యం కాదని సీఎం కేసీఆర్‌ చెప్పారు. భూగర్భ గనుల కార్మికులు, వారి పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడానికి సమాంతరంగా ఓపెన్‌కాస్ట్‌లను తేవాల్సి ఉందన్నారు. 2015–16లో 15 శాతం వృద్ధి రేటు సాధించిన సింగరేణి నేడు దేశంలోనే నంబర్‌ వన్‌ కంపెనీగా నిలిచిందన్నారు. అంతే తప్ప భూగర్భ గనులను ప్రభుత్వం మూసివేస్తుందనడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. కొత్తగా 20 ఓపెన్‌కాస్టులు, 12 భూగర్భ గనులను ప్రారంభించనున్నామని కేసీఆర్‌ తెలిపారు. తొలుత ప్రారంభించే 11 గనుల ద్వారా 11,600 ఉద్యోగాలు కల్పిస్తామని.. కార్మికుల కోసం వైద్య కళాశాలతో కూడిన 500 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని చెప్పారు. ఓపెన్‌కాస్టుల కోసం భూములు కోల్పోయిన వారికి తక్షణమే పరిహారం చెల్లిస్తామని.. సింగరేణి ప్రాంతాల్లో ఇళ్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు.

గతంలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకుంటున్నామని, అక్ర మాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రక టించారు. సమైక్య పాలన లో ప్రభావం కోల్పోయిన సింగ రేణి, సిర్పూర్‌ పేపర్‌మిల్లు, రామ గుండం ఎఫ్‌సీఐ, ఆర్టీసీ సంస్థలను పునరు ద్ధరిస్తున్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. విద్యు త్‌ ఉత్పత్తిలోకీ అడుగిడిన సింగరేణి.. జైపూర్‌ వద్ద 1,200 మెగావాట్ల ప్లాంటును నిర్మించిం దని, త్వరలో మరో 800 మెగావాట్ల ప్లాంటు నిర్మించనుందని తెలిపారు.

♦ ఓపెన్‌ కాస్టులు లేకుండా సింగరేణి మనుగడ అసాధ్యం
సాక్షి, హైదరాబాద్‌: లాభాలు ఆర్జిస్తున్న ఓపెన్‌ కాస్టు గనులు లేకుండా సింగరేణి సంస్థ మనుగడ సాధ్యం కాదని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. శాసన మండలిలో గురువారం సింగరేణి సంస్థపై జరిగిన  చర్చ లో మంత్రి మాట్లాడుతూ.. కోల్‌ ఇండియా సహా జాతీయ, అంతర్జాతీయ సంస్థలన్నీ ఓపెన్‌కాస్టు గనులపైనే ఆధారపడి నడుస్తున్నాయన్నారు. భూగర్భ గనుల నష్టాలను ఓపెన్‌ కాస్టుల లాభాలతో పూడ్చుతున్నామని తెలిపారు. సింగరేణి క్లరికల్‌ పోస్టుల భర్తీలో అక్ర మాలపై ఏసీబీ విచారణ ఎంత వరకు వచ్చిందో తెలపాలని కాంగ్రెస్‌ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఓపెన్‌కాస్టుల వల్ల లాభాలు వస్తున్నా పంటలు, పర్యావరణానికి నష్టమని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కార్మిక కుటుంబాల ఇబ్బందుల దృష్ట్యా మొబైల్‌ ఏటీఎంలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ సభ్యుడు కోమటిరెడ్డి కోరారు. భూగర్భ గనులు 60 నుంచి 30కి తగ్గిపోగా ఓపెన్‌కాస్టు గనులు 10 నుంచి 17కు పెరి గాయని, భూగర్భ గనులనూ కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఓపెన్‌కాస్టుల కాలుష్యం తగ్గించేందుకు ప్రత్యామ్నాయ విధా నాలు అమలు చేయాలని టీఆర్‌ఎస్‌ సభ్యుడు లక్ష్మీ నారాయణ సూచించారు. సింగరేణిలో గిరిజనుల బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని మరో టీఆర్‌ఎస్‌ సభ్యుడు రాములు నాయక్‌ కోరారు. ఈ అంశంపై చర్చను శుక్రవారానికి చైర్మన్‌ స్వామిగౌడ్‌ వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement