
కేసీఆర్ నాయకత్వంలోనే వారసత్వ ఉద్యోగాలు
కాసిపేట : సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు సాధించి తీరుతామని గుర్తింపుసంఘం టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ తెలిపారు. గురువారం మందమర్రి ఏరియా కాసిపేట గనిపై ఏర్పాటు చేసిన గేటుమీటింగ్‌లో కార్మికులనుద్దేశించి మాట్లాడారు. కార్మికుల హక్కులను కాపాడుతూ అదనపు ప్రయోజనాలు సమకూర్చడం మినహా ఏఒక్క హక్కు తాకట్టు పెట్టలేదన్నారు. జాతీయ సంఘాలు ఒక్క సమస్య పరిష్కరించకుండా టీబీజీకేఎస్‌ను విమర్శించడం పనిగా పెట్టుకున్నాయన్నారు. 2009నుంచి2013వరకు అపాయింట్‌మెంట్ బీసీఎఫ్ కార్మికులందరికీ జనరల్ మజ్దూర్ ప్రమోషన్‌లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.
2014-15లో 190మస్టర్లు నిండినవారు సైతం అర్హులేనన్నారు. ఏరియాలో 120మంది సర్ఫేస్ జనరల మజ్దూర్‌లకు పదోన్నతులు కల్పించినట్లు తెలిపారు. సింగరేణిలో రెండో కాన్పు, పీఎంఈ మస్టర్, సన్మానం ఖర్చు పెంపు, యూనిఫాం తదితర అనేక హక్కులు సాధించడం జరిగిందన్నారు. శిథిలావస్థలో ఉన్న క్వార్టర్లను నామమాత్రపు కిరాయితో రిటైర్డ్ కార్మికులకు ఇచ్చేందుకు సీఅండ్‌ఎండీకి విన్నవించినట్లు తెలిపారు. సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సకలజనుల సమ్మె కాలపు వేతనాలు, వారసత్వ ఉద్యోగాలకు ప్రధానంగా కార్మికులు ఎదురు చూస్తున్నారని, త్వరలో సమస్య పరిష్కరించి కార్మికుల ముందుకు రానున్నట్లు తెలిపారు.
గతంలో నెలకు 25మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని ఉన్న అగ్రిమెంట్‌ను తొలగించి ఒక్క సంవత్సరంలో 3,200మందికి ఉద్యోగాలు కల్పించినట్లు వివరించారు. జనరల్ మజ్దూర్‌లకు ప్రమోషన్ కల్పిస్తూ డెప్యుటేషన్‌తో పాటు ఎక్కడ పనిచేసే వారికి అక్కడే కేటాయించనున్నట్లు తెలిపారు. సమావేశంలో గుర్తింపుసంఘం ఫిట్ కార్యదర్శి వొడ్నాల రాజన్న, టీబీజీకేఎస్ నాయకులు అమరకొండ రాజయ్య, కోరవేణి లక్ష్మణ్, సీపెల్లి రాజలింగు, బెల్లం అశోక్, బాబురావు, దుర్గం శ్రీను, భైరగోని సిద్దయ్య, రాజ్‌కుమార్ తదితరులున్నారు.